సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో తమిళనాడులో బీజేపీకి పెద్ద షాకే తగిలినట్లుంది. అందుకనే తాజా రాజకీయపరిణామాలపై కమలంపార్టీ నేతల్లో ఎవరు కూడా నోరిప్పలేకపోతున్నారు. అన్నాత్తై రజనీకాంత్ ను ముందుకుతోసి తమిళనాడుపై పట్టు సాధించవచ్చని ఇంతకాలం బీజేపీ పెద్ద ప్లానే వేసింది. కారణాలు ఏవైనా రజనీకాంత్ కూడా కొత్తపార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆర్భాటంగానే ప్రకటించారు. అయితే ఎవరు ఊహించనిరీతిలో చివరి నిముషంలో పొలిటికల్ ఎంట్రీ నుండి విత్ డ్రా అవుతున్నట్లు చేసిన ప్రకటన ఇఫుడు చర్చగా మారిపోయింది. రజనీ ప్రకటనతో డీఎంకే, అన్నా డీఎంకేతో పాటు మరికొన్ని పార్టీలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నాయి. అయితే ఒక్క బీజేపీ మాత్రమే షాక్ తగిలినట్లయిపోయింది. ఎందుకంటే రజనీ ప్రకటనను కమలం నేతలు ఏమాత్రం ఊహించలేదట. రజనీని ముందుపెట్టి వెనుకనుండి షో చేద్దామని బీజేపీ ఢిల్లీ పెద్దలు వేసిన స్కెచ్ దారుణంగా ఫెయిలైనట్లు సమాచారం. దాంతో ఏమి మాట్లాడాలో తెలీక అందరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
తమిళ రాజకీయాల్లో పట్టుసాధించేందుకు బీజేపీ దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉంది. అయితే ఇప్పటివరకు కనీసం ఒక్క ఎంఎల్ఏని కూడా గెలిపించుకోలేకపోతోంది. తమిళరాజకీయాలు మొత్తం దశాబ్దాలుగా డీఎంకే-అన్నా డీఎంకే మధ్యే తిరుగుతున్నాయి. జనాలు కూడా ఈ రెండుపార్టీల్లో దేనికో ఒకదానికి కచ్చితమైన మెజారిటి ఇస్తుండటంతో మూడో పార్టీకి అవకాశమే లేకుండా పోతోంది. కాంగ్రెస్ అయితే అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చరిత్రలో చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తోంది. ఇపుడు తమిళరాజకీయాల్లో అతిరధ, మహారథులని చెప్పుకోతగ్గ వాళ్ళు ఎవరు లేరు. కరుణానిధి, జయలలితలు వెంటవెంటనే మరణించటంతో ఏపార్టీలో కూడా గట్టి లీడర్లు లేరనే చెప్పుకోవాలి. ఉన్నవారిలో డీఎంకే చీఫ్ స్టాలిన్ మాత్రమే కాస్త మాస్ లీడర్ గా కనిపిస్తున్నారు.
అందుకనే బీజేపీ వ్యూహాత్మకంగా రజనీని తెరమీదకు తెచ్చింది. ఎలాగైనా రజనీకాంత్ తో పార్టీ పెట్టించి వెనుకనుండి షో రన్ చేయాలని ప్లాన్ చేసిందట. అయితే విషయం అర్ధం చేసుకున్న రజనీ అనారోగ్యం+వయస్సయిపోవటం అనే కారణాలను చెప్పేసి విత్ డ్రా అయిపోవటంతో ఏమి చేయాలో బీజేపీకి ఇపుడు దిక్కుతోచటం లేదు. ఇదే సమయంలో ఏఐఏడీఎంకే కూడా కేవలం భాగస్వామ్య పార్టీగా ఉంటే పర్వాలేదు కానీ అధికారంలో భాగం కావాలంటే ఇచ్చేది లేదని బీజేపీకి కుండబద్దలు కొట్టకుండానే చెప్పేసింది. దాంతో బీజేపీ నేతల మైండ్ బ్లాంకు అయిపోయింది. ఇటు రజనీ హ్యాండిచ్చి అటు ఏఐఏడీఎంకే కూడా దూరం పెట్టేయటంతో ఇపుడు బీజేపీకి దారి కనబడటం లేదు. ఎందుకంటే బలమైన పార్టీగా ప్రచాంలో ఉన్న డీఎంకే యూపీఏ కూటమిలో ఉంది. అందుకనే మెల్లిగా కూటమి నుండి లాగటానికి డీఎంకేను దువ్వటం మొదలుపెట్టిందట. మరి డీఎంకే కూడా గాలానికి తగలకపోతే బీజేపీ ఏమి చేస్తుందన్నది సస్పెన్సుగా మారింది.