తిరుపతి లోక్ సభలో పోటీ చేసే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భయపడ్డారా ? అవుననే అనిపిస్తోంది ఆయన తాజాగా చేసిన ప్రకటన చూసిన తర్వాత. మదలపల్లి టూర్లో ఉన్న వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ తొందరలోనే ఉపఎన్నికలో పోటీ విషయమై బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఇంకా మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. పైగా తమ రెండు పార్టీల నుండి ఎవరో ఒకరే అభ్యర్ధిగా ఉంటారని చెప్పటం పెద్ద జోకుగా మారింది. మిత్రపక్షాలన్నాక రెండుపార్టీలో ఎవరో ఒకరే పోటీ చేస్తారని వీర్రాజు కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. ఇక తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారంటూ తిరుపతి కార్యవర్గ సమావేశం సందర్భంగా వీర్రాజు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వీర్రాజు ప్రకటన నిజానికి ఏకపక్షంగా చేసిందన్న విషయం అప్పుడే అందరికీ అర్ధమైపోయింది. చాలా దూకుడుమీదుండే వీర్రాజు మిత్రపక్షం జనసేన విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్షాలు తెలుగుదేశంపార్టీ, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ విషయంలో వీర్రాజు దూకుడుగా వ్యవహరించారంటే అర్ధముంది. మరి మిత్రపక్షాన్ని కూడా లెక్కలేనట్లుగా మాట్లాడితే ఎలా ? తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ విషయంలో వీర్రాజు తొందరపడి చేసిన ఏకపక్ష ప్రకటనే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టినట్లుంది. వీర్రాజు ప్రకటనపై జనసేన తీవ్ర అభ్యంతరం పెట్టడమే కాకుండా అధ్యక్షుని వ్యవహర శైలిపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి నడ్డా దగ్గర నుండి వీర్రాజుకు ఏమైనా ఫోన్ వచ్చిందో ఏమో తెలీదు కానీ తన దూకుడు బాగా తగ్గించేశారు. అందుకనే అభ్యర్ధి విషయంలో తమ రెండుపార్టీలు చర్చించుకుంటున్నాయంటు చెప్పటం.
నిజానికి తిరుపతి లోక్ సభ పరిధిలో రెండుపార్టీలకూ పెద్ద బలమేమీ లేదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16500. జనసేన బలపరచిన బీఎస్పీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు సుమారు 20 వేలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)కు వచ్చిన ఓట్లు 25 వేలు. అంటే నోటాకన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న రెండు పార్టీల వాస్తవ బలం ఎంతన్నది తేలిపోయింది. అలాంటిది వచ్చే ఎన్నికల్లో గెలిచిపోయేస్ధాయిలో పోటీ కోసం గొడవలు పడుతుండటమే విచిత్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటినే 2.28 లక్షలు. టీడీపీకి వచ్చిన ఓట్లు సుమారు 4.8 లక్షలు. దీన్నిబట్టే రాబోయే ఉపఎన్నికల్లో ఈ రెండుపార్టీల్లో ఎవరు పోటీ చేసినా ఎన్నిఓట్లు వస్తాయనే విషయంలో ఓ అంచనాకు రావచ్చు.