అందరికీ శకునం చెప్పే బల్లి చివరకు కుడితిలో పడిందనే సామెతలాగ తయారైపోయింది తిరుగుబాటు ఎంపి కృష్ణంరాజు వ్యవహారం. వైసీపీ బ్యానర్ మీద నర్సాపురంలో గెలిచిన కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమంటో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏదో ఓ కారణం చూపించి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయందే ఈ ఎంపికి నిద్రపట్టదు. అలాంటి ఎంపి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీని వెంటనే ఆపుచేయాలట. ఎందుకంటే రాజధాని అమరావతి భూముల వ్యవహారంపై విచారణ జరుగుతున్న కేసులు క్లైమ్యాక్స్ కు చేరుకుందట. ఈ దశలో మహేశ్వరిని బదిలీ చేస్తే రైతులకు అన్యాయం జరుగుతుందట. కాబట్టి తక్షణమే మహేశ్వరి బదిలీని నిలిపేయాలని సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసేశారు.
నిజానికి హైకోర్టుల చీఫ్ జస్టిసులు, జడ్జీల బదిలీ వ్యవహారం న్యాయవ్యవస్ధ అంతర్గత విషయం. ఇందులో బయటవాళ్ళ జోక్యం అవసరం లేదు. ఈ విషయం తెలిసికూడా ఎంపి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారంటే అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కిందకే వస్తుంది. చీఫ్ జస్టిస్ గా మహేశ్వరి కాకపోతే మరో గోస్వామి ఉంటారు. సీటులో ఎవరున్నా విచారణలు, తీర్పులు మెరిట్ ఆఫ్ ది కేసు ప్రకారమే ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇంతమాత్రానికే మహేశ్వరే చీఫ్ జస్టిస్ గా ఉండాలని ఎంపి కోరుతున్నారంటే తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చీఫ్ జస్టిస్ బదిలీ విషయంలో కానీ, జడ్జీ బదిలీ, పోస్టింగు విషయాల్లో ఎంపిలు జోక్యం చేసుకోవటం అన్నది గతంలో ఎప్పుడూ లేదు.
ఓసారి చరిత్రలోకి వెళదాం. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి+మరో ఆరుగురు జడ్జీల వ్యవహారశైలిని తప్పుపడుతు జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి ఫిరాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదును మీడియాకిచ్చారు. దాన్ని చాలామందితో పాటు ఈ ఎంపి కూడా కృష్ణంరాజు తప్పుపట్టారు. న్యాయవ్యవస్ధ అంతర్గత వ్యవహారాల్లో జగన్ జోక్యం చేసుకుంటున్నారన్నారు. న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేయటం ద్వారా వాళ్ళ ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదును మీడియాకు ఇవ్వటమంటే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అంటు నోటికొచ్చింది మాట్లాడారు. మరి ఇపుడు మహేశ్వరి బదిలీ విషయంలో ఎంపి చేసిందేమిటి ? కోర్టు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా ? కేసుల విచారణ జరిగి తీర్పు చెప్పేంతవరకు మహేశ్వరిని బదిలీ చేయకూడదని లేఖ రాయటమంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుకు పాల్పడటమే కదా. అంటే జగన్ చేసింది తప్పు, ఎంపి చేసింది మాత్రం ఒప్పా ?