హెరాల్డ్ సెటైర్ : త్రిమూర్తులు ఏమైపోయారబ్బా ...ఎక్కడా అడ్రస్సే లేరే ?

Vijaya
ఒకవైపేమో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో ప్రచారం హోరెత్తిపోతోంది. వివిధ పార్టీలు తమ స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపటం ద్వారా ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు కురిపిస్తున్నాయి. ప్రచార హోరు ఎక్కువగా అధికార టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్యే నడుస్తోంది. మరి ఇటువంటి సమయంలో మరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశంపార్టీ ఎక్కడా ప్రభావం చూపుతున్నట్లు కనబడటం లేదు. ఆ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కూడా ఎక్కడా పెద్దగా జోష్ కనిపించటం లేదు. ఎందుకంటే టీడీపీ తరపునంటు స్టార్ క్యాంపైనర్లన్నవాళ్ళే ఎక్కడా కనబడటం లేదు కాబట్టి. 150 డివిజన్లకు గాను 104 చోట్ల టీడీపీ పోటీ చేస్తోంది. మరి ఉండటానికి త్రిమూర్తులుగా ప్రచారంలో ఉన్న చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా ప్రచారం పేరుతో ఇంట్లో నుండి అడుగు బయటపెట్టలేదు. వీళ్ళు ముగ్గురు ఎందుకు ప్రచారానికి రావటం లేదన్నదే పార్టీ నేతలను తొలిచేస్తున్న ప్రశ్న.



పోయిన ఎన్నికల్లో లోకేష్ చాలా డివిజన్లలో ప్రచారం చేశారు. సరే ఒక్క డివిజన్లో కూడా టీడీపీ గెలవలేదన్నది వేరే సంగతి. అయితే గెలుపోటములను దృష్టిలో  పెట్టుకుని కాదు కద ప్రచారం చేసేది. ఎందుకంటే పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు గెలుస్తామనే నమ్మకంతోనే పోటీలోకి దిగుతారు. కానీ అంతిమంగా గెలిచేది ఒక్కళ్ళే అని అందరికీ తెలుసు. కానీ గెలుపుకోసం అందరు తీవ్రంగా కృషి చేస్తారు. ఈ కృషిలో భాగమే ప్రచారం. నిజానికి అభ్యర్ధులు చేసుకునే ప్రచారమైనా లేకపోతే అభ్యర్ధుల తరపున ప్రచారమైనా చాలా కీలకమని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ను తానే నిర్మించానన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు మరి ప్రచారానికి ఎందుకు దిగలేదు. హైటెక్ సిటీని తానే నిర్మించానని చెప్పుకుంటాడు. మెట్రో రైలుకు తానే ఆధ్యుడనని చెప్పుకుంటాడు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు తన కృషి ఫలితమే అని నేతల సమావేశాల్లో చంద్రబాబు చెప్పుకోవటం అందరికీ తెలిసిందే.



నిజానికి శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలుతో చంద్రబాబుకు సంబంధం లేదని అందరికీ తెలుసు. అయినా వాటిని తన ఘనతగానే చెప్పేసుకుంటారు. ప్రతి పాజిటివ్ డెవలప్మెంటును తన ఘనతగానే చెప్పుకునే చంద్రబాబు గ్రేటర్ ప్రచారంలో వాటినే చెప్పుకోవచ్చు కదా. మరెందుకు ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటున్నారు ? ఎంతకాలమని కరోనా వైరస్ పేరుతో నేతలు, కార్యకర్తలతో పాటు జనాలకు దూరంగా ఇంట్లోనే  ఉంటారు ? ఏవో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి జనాల్లోకి వచ్చేయాలి. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి టీడీపీ మళ్ళీ తన పూర్వవైభవాన్ని మొదలుపెట్టాలని చంద్రబాబు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. మరి ఆ పిలుపు కేవలం నేతలకేనా తనకు వర్తించదా ? నాయకుడన్నవాడు ముందుండి నడపాలి కానీ ‘మీరు రంగంలోకి దిగండి నేను మాత్రం ఇంట్లోనే కూర్చుంటా’నంటే కుదురుతుందా ? కనీసం స్టార్ ఎట్రాక్షన్ నందమూరి బాలయ్యబాబు కూడా ఎక్కడా కనబడలేదు. అంటే త్రిమూర్తులు గ్రేటర్ ఎన్నికల్లో ఇక కనిపించే అవకాశం లేదని దాదాపు తేలిపోయినట్లేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: