ఇంకోరి గెలుపును చంద్రబాబునాయుడు తన గెలుపుగా పండగ చేసుకున్నాడా ? వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా దుబ్బాక ఉపఎన్నికను చంద్రబాబు, నారా లోకేష్ ను కలిపి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అవసరం అయ్యింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున దివంగత ఎంఎల్ఏ భార్య సుజాత, బీజేపీ అభ్యర్దా రఘునందనరావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరకు శ్రీనివాసరెడ్డి పోటి చేశారు. తెలంగాణాలో అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ ప్రకటనలు ఇచ్చే తెలుగుదేశంపార్టీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. ఉపఎన్నికల్లో పోటీ చేయాలంటేనే టీడీపీ భయపడిపోయింది. మరి ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి టీడీపీని ఇంతగా భయపెట్టిన అంశం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
క్షేత్రస్ధాయిలోని సమాచారం ప్రకారం చూసినా, చరిత్రను తిరగేసినా కేసీయార్ అంటే భయంవల్లే టీడీపీ ఎన్నికల్లో దూరంగా ఉండిపోయిందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పని చంద్రబాబు బీజేపీ గెలుపును మాత్రం పండుగ చేసుకున్నారంటు విజయసాయి ఎద్దేవా చేశారు. ‘తండ్రి టీడీపీ జాతీయ అద్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి . దెబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి వీళ్ళకు అభ్యర్ధి దొరకలేదు. అక్కడ బీజేపీ గెలిస్తే సొంతపార్టీ అభ్యర్ధే గెలిచినట్లు మురిసిపోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవటం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్లా వింత’. అంటూ ఎంపి పెట్టిన ట్విట్ బాగా వైరల్ అవుతోంది.
అసలింతకీ దుబ్బాకలో టీడీపీ తరపున పోటీ పెట్టటానికి నిజంగానే చంద్రబాబుకు అభ్యర్ధే దొరకలేదా ? అనే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది. మరి ఒక్క దుబ్బాకలోనే పోటీ చేయటానికి అభ్యర్ధి దొరకకపోతే రేపు డిసెంబర్ 4వ తేదీన జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాటేమిటి ? అనే డౌటనుమానం పార్టీ నేతల్లోనే పెరిగిపోతోంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలంటే 150 మంది అభ్యర్ధులు కావాలి. పైగా 150 డివిజన్లలోను పోటీ చేయటానికి ఏ పార్టీతోను పొత్తులు కూడా లేదంటే ఒంటిరిపోరాటమే దిక్కు. ఈ పరిస్ధితుల్లో చంద్రబాబు ఏమి చేస్తారనేది పెద్ద సస్పెన్సుగా మారింది.
ఇంతకీ చంద్రబాబు, లోకేష్ విషయంలో విజయసాయిరెడ్డి చెప్పింది నిజమేనా ? అంటే పరోక్షంగా బీజేపీ విజయానికి టీడీపీ ఏమన్నా సహకారం అందించిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆమధ్య మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పై మూడు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఓ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పై మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన గెలుపులో టీడీపీ పాత్ర కూడా ఉందంటు చేసిన ప్రకటనతో అందరు ఆశ్చర్యపోయారు. ఎక్కడో ఉత్తరాధి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఏపిలోని టీడీపీ పాత్ర ఏముంటుందని ఎంత ఆలోచించినా తోచలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ విజయానికి చంద్రబాబు డైరెక్టుగా కాకుండా తెరవెనుక నుండి ఏమన్నా సహకారం అదించారేమో అనే అనుమానాలు పెరిగిపోయాయి. ఇపుడు కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన తర్వాత మళ్ళీ చంద్రబాబుపై అటువంటి అనుమానమే పెరుగుతోంది.