హెరాల్డ్ సెటైర్ : బీజేపీ ఓవర్ యాక్షనే కొంప ముంచబోతోందా ?

Vijaya
బీహార్ లో మూడు దశల పోలింగ్ తర్వాత బయటకొచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తే ఇదే విషయం అర్ధమవుతోంది.  ఎగ్జిట్ పోల్ ఫలితాల పేరుతో చాల సంస్ధలు సర్వేలు చేశాయి. ఏ సంస్ధ రిలీజ్ చేసిన ఎగ్జిట్ ఫలితాల్లో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. మూకుమ్మడిగా అన్నీ సంస్దలు కలుపుకుని ఆర్జేడీ నేతృత్వంలోని  మహాగట్ బంధన్ (ఎంజీబీ)కే పట్టం కట్టాయి.  ఎన్నికల ముందున్న అంచనాలు పోలింగ్ నాటికి ఎందుకు తల్లక్రిందులైపోయాయి ? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం బీజేపీ చేసిన డబుల్ యాక్షనే కారణమని మెల్లిగా అర్ధమవుతోంది. ఒకవైపు నితీష్ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటిస్తునే మరోవైపు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగా పాశ్వాన్ను బాగా దువ్వింది. అంటే ఇటు నితీష్ ద్వారా అటు చిరాగ్ ద్వారా ఏకకాలంలో లబ్ది పొందాలని బీజేపీ చేసిన ప్లాన్ చివరకు బెడిసికొట్టినట్లు అర్ధమవుతోంది.



ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ కూడా ఒకటి. పార్టీ మాజీ అధ్యక్షుడు, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్డీయేలో కీలక పాత్ర పోషించేవాడు బీహార్ రాజకీయాల్లో.  బీహార్లో ఎన్డీయే కూటమి ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన తర్వాత హఠాత్తుగా పాశ్వాన్ మరణించారు. దాంతో పాశ్వాన్ కొడుకు, ఎల్జేపీ అద్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరైపోయాడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారు.  దాని ఫలితంగానే కేంద్రంలో ఎన్డీయే కూటమిగా ఉంటూనే బీహార్లో మాత్రం విడిగా పోటీ చేస్తామంటూ చిరాగ్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఒకవైపు నితీష్ కుమార్ ను తీవ్రంగా వ్యతిరేకించిన చిరాగ్ మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడిని మాత్రం తెగ మోసేశాడు. ఇదంతా చూసిన వాళ్ళకు చిరాగే డబల్ గేమ్ ఆడుతున్నాడనే అనిపించింది. కానీ కాలం గడిచి అభ్యర్ధుల నామినేషన్ వేసే రోజు దగ్గర పడేకొద్దీ అసలు విషయం బయటపడింది.



ఎలాటంటే జేడియు అభ్యర్ధులపై గట్టిపోటి అభ్యర్ధులను రంగంలోకి దింపిన  చిరాగ్ బీజేపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా మాత్రం చాలా చోట్ల బలహీన అభ్యర్దులను రంగంలోకి దింపారు. ఇదంతా చూసిన వాళ్ళకు బీజేపీనే చిరాగ్ తో డబుల్ గేమ్ ఆడిస్తోందన్న విషయం మెల్లిగా అర్ధమైంది. ఇదంతా బీజేపీ ఎందుకు చేసిందంటే ఒకే దెబ్బకు ఇటు నితీష్ ను అటు చిరాగ్ ను దెబ్బకొట్టి అత్యధిక స్ధానాలు గెలుచుకుంటే బీహార్ ను తానే ఏలచ్చనే ఆలోచనతోనే. బీహార్ లోని ఎస్సీ ఓట్లపై రామ్ విలాస్ పాశ్వాన్ మరణం విపరీతమైన సింపతి చూపిస్తుందని అనుకున్నది. కానీ అది బెడిసికొట్టిందని తర్వాత అర్ధమైపోయింది. అలాగే  చిరాగ్ తనను తాను చాలా పెద్ద స్ధాయిలో ఊహించుకున్నాడన్న విషయం కూడా తర్వాత బీజేపీకి అర్ధమైపోయింది. దాంతో ఏమి చేయాలో బీజేపీ నేతలకు తోచలేదు. ఎందుకంటే అప్పటికే అభ్యర్ధుల ఎంపిక, నామినేషన్లు వేసి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.



ఇదే సమయంలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఎంజీబీ చాలా గట్టిగా పోరాటం మొదలుపెట్టింది. యువకుడైనా తేజస్వికి యువ ఓటర్లు, మధ్య తరగతి జనాల్లో ఉన్న మద్దతును ఎన్డీయే నేతలు గ్రహించలేకపోయారు. 15 ఏళ్ళుగా సీఎంగా ఉన్న నితీష్ పరిపాలన కేంద్రంలో మోడి  ఛరిష్మానే ఎన్డీయేను గట్టెక్కిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కనబడింది మరోటి. ఎంజీబీ కి వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి నేతలు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన విషయం ఎగ్జిట్ పోల్స్ లో అర్ధమైపోయింది.  మొత్తం మీద ఎగ్జిట్ పోల్ సర్వేల్లో అర్ధమైయ్యిందేమంటే ఇటు జేడీయు అటు బీజేపీ అభ్యర్ధుల విజయవకాశాలను ఎల్జేపీ  అభ్యర్ధులు సుమారు 55 నియోజకవర్గాల్లో దెబ్బకొట్టారని. దళితుల ఓట్లను ఏకం చేయటంలో రామ్ విలాస్ పాశ్వాన్ వేరు కొడుకు చిరాగ్ పాశ్వాన్ వేరన్న విషయాన్ని బీజేపీ పెద్దలు గ్రహించకపోవటమే మొత్తంగా ఎన్డీయే కూటమి కొంపముంచేయబోతోందని అంచనా. ఈ మొత్తానికి కారణం ఏమిటయ్యా అంటే బీజేపీ ఓవర్ యాక్షనే కారణమని అర్ధమైపోతోంది. మరి ఫలితాల్లో ఏమి తేలుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: