హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు పరువు తీసేస్తున్న కుప్పం నేతలు
కుప్పంకు మంచినీటి సరఫరా రావటం లేదనేది తమ్ముళ్ళ ప్రధాన ఆరోపణ. ఇందులో నూరుశాతం నిజముంది. అయితే కుప్పంకు నీటి సౌకర్యం ఇప్పటివరకు లేదంటే అందుకు బాధ్యత ఎవరిది ? 1989 నుండి కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నది చంద్రబాబునాయుడే కదా. గడచిన 30 ఏళ్ళలో ఎంఎల్ఏ గా మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా కుప్పం నుండి చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా ఎంఎల్ఏ అయిన వాళ్ళు కూడా తమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. మంచినీటి సౌకర్యం, రోడ్లు లేదంటే ఇతర సౌకర్యాలు కావాలని పదే పదే ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు. మరి మంత్రిగా ఉంటే జిల్లాలో ముందు తమ నియోజకవర్గం డెవలప్మెంట్ చూసుకున్న తర్వాతే జిల్లా డెవలప్మెంట్ గురించి ఆలోచించే మంత్రులు కూడా ఉన్నారు. అంటే ఎంఎల్ఏ అయినా మంత్రయినా ముందు తమ నియోజకవర్గం, తమ జిల్లా అభివృద్ది మీద దృష్టి పెడతారు. కానీ చంద్రబాబు ఏమి చేశారు ?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ నుండి కుప్పంకే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు కనీస అవసరమైన మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారంటే అది ఎంత అవమానం. ఈ 30 ఏళ్ళల్లో 15 ఏళ్ళు సిఎంగానే ఉన్నారు కదా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురం నుండి కాలువలు తవ్వించి చిత్తూరు జిల్లాలోకి నీటి సౌకర్యం ఏర్పాటు చేయలని కష్టపడ్డారు. చాలా వరకు కాలువల తవ్వకాలు కూడా పూర్తయిపోయాయి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మరణించటంతో పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయిన తర్వాత మళ్ళీ కాలువ పనులు జరిగాయి. 2014 ఎన్నికల కారణంగా తర్వాత మళ్ళీ ఆగిపోయాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏమి చేశారు ? అనంతపురం జిల్లా మీదుగా చిత్తూరు జిల్లాలోని కాలువ పనులను వెంటనే ఎందుకు పూర్తి చేయించలేదు ?