రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న మన చినబాబు పార్టీలో తనదే పైచేయి గా ఉండాలని గట్టిగానే తన బలం నిరూపించుకు ని ప్రత్యర్థులకు దడ పుట్టించేందుకు, సొంత నాయకులకు నమ్మకం కలిగించేందుకు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. మొన్నటి వరకు హైదరాబాదులో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండగా, వైసిపి తో పాటు, టిడిపి రాజకీయ ప్రత్యర్థులు నానారకాలుగా తిట్టిపోస్తూ, చంద్రబాబును ఓ ఆట ఆడేసుకోవడంతో, ఏం చేయాలో తెలియక, తెగించి మరీ జనాలకు దగ్గరయ్యేలా, మీరే కావాలి, మీరే రావాలి, మీరే సీఎం అభ్యర్థి అని, పిలిపించుకునేందుకు, నానా తంటాలు పడుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ లో ఎప్పుడో, పట్టు పెంచుకోవాల్సిన చినబాబు తన శక్తి సామర్ధ్యాలు మరీ ఎక్కువై పోవడంతో, వాటి జోలికి వెళ్లలేదు.
అలా అనేకంటే లోకేష్ తండ్రి చంద్రబాబు పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కొద్దిరోజుల క్రితమే సైకిల్ నడిపించే బాధ్యత మొత్తం అచ్చెన్న కు అప్పగించేశారు. దీంతో పార్టీలో తన క్రెడిట్ తగ్గిపోతుందని భయపడిపోయిన చినబాబు ఆగమేఘాలమీద ఏపీలో వాలిపోయారు. అంతేనా రైతులకు అన్యాయం జరిగిందంటూ బురదలో దిగిపోయి, కొద్దిగా వైసిపి పైన బురద అంటించెందుకో ఏంటో తెలియదు కానీ, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకువీడు మండలంలో సిద్దాపురం గ్రామంలో పర్యటించిన చినబాబు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని విన్యాసాలు చేయబోయారు. అసలే తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ పట్టుకోవడం చేత కావట్లేదు అని, అందరూ ఆడి పోసుకుంటున్న సమయంలోనే చిన బాబు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకున్నారు.
పోనీ ఏమైనా ఆయనకు కలిసొచ్చిందా అంటే, ఆ స్టీరింగ్ పట్టుకోవడం కూడా సరిగ్గా చేతకాక, కాలువలోకి ఆ ట్రాక్టర్ ను నడిపించడం, వెంటనే పక్కనే ఉన్న ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ట్రాక్టర్ ను అదుపులోకి తెచ్చుకోవడం, ఇలా ఎన్నో జరిగిపోయాయి. ఇక ఈ వ్యవహారంపై, టిడిపి అనుకూల మీడియా లో చిన బాబు కు తప్పిన ప్రాణ గండం అంటూ బ్రేకింగ్ న్యూస్ లు వరుసగా వచ్చేయడం, ఇదో పెద్ద సంచలనంగా మారడం వంటి వ్యవహారాలతో చిన బాబు పేరు మారుమోగిపోయింది. అప్పుడే ఆయన పై రాజకీయ ప్రత్యర్థులు సెటైర్లు సైతం వేసేశారు. ట్రాక్టర్ స్టీరింగ్ అదుపు చేయలేని చంద్రబాబుకు టిడిపి స్టీరింగ్ అవసరమా అంటూ అదే పనిగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దీంతో అనవసరంగా ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకున్నాను అనే బాధ చినబాబు లోనూ, టిడిపి స్టీరింగ్ చినబాబు కు అప్పగిస్తే అదుపు తప్పి యాక్సిడెంట్లు చేస్తారేమో అనే ఫీలింగ్ చంద్రబాబు లో వచ్చేసినట్లు గా ఒకటే గుసగుసలు.