హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు పరువు లోకేషే తీసేశాడా ?

frame హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు పరువు లోకేషే తీసేశాడా ?

Vijaya
అలాగే ఉంది తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారావారి పుత్రరత్నం నారా లోకేష్ తాజాగా చేసిన ట్వీట్ చదివిన వారికి. ఇంతకీ లోకేష్ చెప్పిందేమిటయ్యా అంటే ’ఐదేళ్ళ క్రితం ఇదేరోజున శంకుస్ధాపన చేసుకున్న అమరావతి నిర్మాణం జరిగి ఉంటే ఈరోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉండేదట. కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి తమ ’విషపునీయత’ను చూపించుకున్నారట. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందాం’ అంటూ లోకేష్ ట్విట్ చేశాడు. ఈ ట్వీట్ చదివిన తర్వాత చంద్రబాబునాయుడు చేతకాని తనమే అందరికీ గుర్తుకొస్తోంది. అమరావతి అనే పదాన్ని భ్రమరావతిగా మార్చిందే చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణం  పేరుతో జనాలను మోసం చేసి మాయచేసి గ్రాఫిక్కులు చూపించిందే చంద్రబాబు. క్షేత్రస్ధాయిలో ఎక్కడా కనబడకుండా వందల కోట్ల రూపాయలు కేవలం గ్రాఫిక్కులకు, ఆర్కిటెక్టులకే ఖర్చుపెట్టిన ఘనత చంద్రబాబుకు ఒక్కడికే దక్కుతుంది.



అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా, సింగపూర్ అని, స్విస్ ఛాలెంజ్ అని అనవరంగా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే నిజంగా అమరావతి నిర్మాణం జరిగిపోయుండేదేనటంలో సందేహం లేదు. అంతర్జాతీయ రాజధాని అనే ఓవర్ యాక్షన్ చేయకుండా మన అవసరాలు ఏమిటి ? మన ఆర్ధిక పరిస్దితి ఏమిటి ? అనే విషయాలపై కనీసమాత్రపు స్పృహ కలిగుంటే బాగుండేది. మన అవసరాలకు తగ్గట్లుగా  అసెంబ్లీ, సచివాలయం, రాజం భవన్ లాంటివి కట్టేసుంటే సరిపోయేదే. కానీ చంద్రబాబు ఏమి చేసినా బాగా అతిగానే కనిపించింది. పనికిమాలిన, నాసిరకం నిర్మాణాలకు  తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడు. దీనికి అదనంగా హైకోర్టు నిర్మాణం ఒకటి. చంద్రబాబు హయాంలో  జరిగిన  ప్రతి నిర్మాణమూ నాసిరకమే. చిన్నపాటి వర్షం గట్టిగా కురిస్తే వెంటనే భవనాల్లోపలంతా కురవటమే. ఇంతోటి తాత్కాలిక  భవనాలకు మళ్ళీ వెయ్యి కోట్ల ఖర్చు.



అమరావతి నిర్మాణం మొత్తాన్ని ఓ గేటెడ్ కమ్యూనిటిగా మార్చేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. సినీ దర్శకుడు రాజమౌళితో కలిసి కలలుగన్న సినిమా సెట్టింగుల్లాంటి నిర్మాణాలను సింగపూర్ కంపెనీలతో కలిసి ప్లాన్ చేయటం వల్లే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మన ఆర్ధిక పరిస్ధితికి తగ్గట్లుగా ఓ మూడు, నాలుగు వేల ఎకరాల్లో సింపుల్ గా ఓ నాలుగు భవనాలు నిర్మించేసి మిగిలింది మొత్తాన్ని ప్రైవేటు సంస్ధలకు, రియల్ ఎస్టేట్ సంస్ధలకు అప్పగించేసుంటే లోకేష్ కలలు కన్న అమరావతి నిర్మాణం పూర్తియిపోయేదనటంలో  సందేహం లేదు. అలా కాకుండా ఓవర్ యాక్షన్ చేయటం వల్లే చివరకు అమరావతి అన్నది భ్రమరావతిటా మాత్రమే మిగిలిపోయింది. అమరావతి వల్ల జరిగినది ఏమిటయ్యా అంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ మాత్రం దిగ్విజయంగా చేసుకున్నారు పచ్చబ్యాచ్ వాళ్ళు. సరే అతికూడా ఇపుడు వివాదాల్లో పడిందనుకోండి అది వేరే సంగతి.



అప్పట్లోనే చంద్రబాబు ఇంగితంతో ఆలోచించి మన అవసరాలకు తగ్గట్లుగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని తన హయాంలోనే చేసేసుంటే ఈ పాటికి నిజంగా జనాలు పండుగ చేసుకునే వాళ్ళేనేమో. ఈరోజు పండుగ చేసుకోలేకపోతున్నారంటే చంద్రబాబు చేతకానితనమే అని లోకేష్ తన ట్వీట్ ద్వారా ప్రపంచానికి ఎత్తి చూపినట్లయ్యింది. అప్పట్లో చంద్రబాబు సక్రమంగా వ్యవహరించుంటే రాజధాని మార్పుగురించి ప్రకటన చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చుండేది కాదు.  రాజధాని నిర్మించే బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్న చంద్రబాబు ఇపుడు తీరిగ్గా బాధపడుతున్నాడు. తండ్రి బాధను పుత్రరత్నం లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నాడంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: