హెరాల్డ్ సెటైర్ : జీవీఎల్ చాలెంజ్ తో చంద్రబాబు పరిస్దితేంటో అర్ధమైపోయిందా ?
బీజేపి కీలక నేత, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు బిజేపిని అడ్డుపెట్టుకుని మళ్ళీ ఎన్డీఏలోకి రావాలని కాళ్ళా వేళ్ళా పడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏదో రూపంలో బీజేపికి దగ్గరైతే చాలు అన్న పద్దతిలో చంద్రబాబు వాళ్ళదగ్గరికీ వీళ్ళ దగ్గరకి తిరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పని అనుకుంటే చంద్రబాబు కానీ టీడీపీలో సీనియర్ నేతలెవరైనా సరే ఖండివచ్చవని కూడా జీవిఎల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జీవిఎల్ చాలెంజ్ చేసి 48 గంటలవుతున్నా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా బీజేపి నేత చెప్పింది తప్పని చెప్పలేకపోయారు. దీంతోనే చంద్రబాబు పరిస్దితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవిఎల్ చాలెంజ్ పై స్పందిస్తే ఒక సమస్య. స్పందించకపోతే మరో సమస్యగా తయారైంది టీడీపీ పరిస్ధితి. అంటే చంద్రబాబు పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగ తయారైందనే అనుకోవాలి. జీవిఎల్ ప్రకటన తప్పని, తాము ఎన్డీఏలో చేరాలని ప్రయత్నాలేవీ చేయటం లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇదే సమయంలో జీవిఎల్ చెప్పింది నిజమే అని ఒప్పుకుంటే మరో సమస్య మొదలవుతుంది. ఒకపుడు అంటే ఎప్పుడో కాదులేండి మొన్నటి ఎన్నికల సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడిని చంద్రబాబు అనరాని మాటలన్నాడు. చివరకు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భయంతో మళ్ళీ మోడితో సయోధ్యకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు.