హెరాల్డ్ సెటైర్ : డిక్లరేషన్ వివాదాన్ని అనవసరంగా కెలికారే ?
ఎందుకంటే, కొందరు పెద్దలు చేస్తున్న అనాలోచిత వ్యవహారాల వల్లే టిటిడి తరచూ వివాదాల్లో కూరుకుపోతోంది. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే అన్యమతస్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తమకు శ్రీ వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫారంపై ప్రముఖులు సంతకాలు చేస్తారు. దర్శనానకి వచ్చినపుడు గతంలో కొందరు సంతకాలు చేశారు, కొందరు చేయలేదు. నిజానికి ఇది ప్రముఖుల వ్యక్తిగత విషయం. దీనికి మిగిలిన జనాలకు ఏమాత్రం సంబంధం లేదు.
కానీ ఇపుడు ఈ డిక్లరేషన్ విషయం కూడా పెద్ద వివాదమైపోతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి హిందువు కాదనే వాదనను కొందరు జనాల్లోకి పదే పదే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సొంతపార్టీ ఎంపి రఘురామ కృష్ణంరాజు చేస్తున్న ఇటువంటి ఆరోపణలకు చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళ మద్దతుగా మాట్లాడుతున్నారు. తమ రాజకీయానికి, జగన్ను ఇబ్బంది పెట్టటానికి వీళ్ళు మతాన్ని ఓ పావుగా ఉపయోగించుకోవటమే తప్పు. అలాంటిది ప్రభుత్వంలోని ప్రముఖులు కూడా అనాలోచితంగా అందులో ఆజ్యం పోసేట్లు మాట్లాడటం ఇంకా తప్పు.
ఇపుడు టిటిడి దర్శనాల విషయంలో జరిగిందిదే. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు కథనాలు, వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో రాజకీయపార్టీలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం మొదలుపెట్టేశాయి. జగన్ కోసం టిటిడి సంప్రదాయాలనే మార్చేస్తారా ? జగన్ వల్ల హిందూమత విశ్వాశాలు దెబ్బతింటున్నాయంటూ చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కాకముందు కూడా జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎన్నిసార్లు తిరుమలకు వచ్చి దర్శనాలు చేసుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.