హెరాల్డ్ సెటైర్ : అమిత్ షాతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినా ఎల్లోమీడియాకు వార్తేనా ?.. పరువు తీసేస్తున్నారా ?

Vijaya

నిజంగా ఈ వార్త చదివిన తర్వాత అందరిలోను ఓ అనుమానం పెరిగిపోయింది.  అదేమిటంటే చంద్రబాబునాయుడు పరిస్ధితి దిగజారిపోయిందా ? లేకపోతే ఎల్లోమీడియానే పూర్తిగా దిగజారిపోయిందా ? అని. అసలు విషయం ఏమిటంటే చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఫోన్లో మాట్లాడాడట. కరోనా వైరస్ బారిన పడిన అమిత్ షా కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. దాంతో చంద్రబాబు ఫోన్ చేసి మరీ అమిత్ ను పరామర్శించాడని ఎల్లోమీడియాలో ప్రముఖంగా వార్త అచ్చయ్యింది. అమిత్ తో మాట్లాడిన చంద్రబాబు అనారోగ్యం నుండి తొందరగా కోలుకోవాలని చెప్పాడట. అందుకు అమిత్ షా బదులిస్తు తొందరలోనే తన కార్యాలయానికి హాజరవుతానని, సమీక్షలు కూడా నిర్వహిస్తానని చెప్పాడట. నిజంగా న్యూస్ వాల్యు పరంగా చూస్తే ఇందులో ఏమీ లేదనే చెప్పాలి. కానీ అమిత్ షా కు చంద్రబాబు ఫోన్ చేయటాన్ని కూడా ఎల్లోమీడియా ఎందుకంత ప్రముఖంగా ప్రచురించింది ?




ఎందుకంటే గడచిన ఏడాదిన్నరగా నరేంద్రమోడి, అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు. కనీసం వాళ్ళతో  ఫోన్లో మాట్లాడినా అదే మహాభాగ్యమన్నట్లుగా చంద్రబాబు తపించిపోతున్నాడు. అయితే 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిజస్వరూపమేంటో వీళ్ళిద్దరికీ బాగా అర్ధమైపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తిరిగి తనను నోటికొచ్చినట్లు విమర్శించిన చంద్రబాబుపై మోడికి ఎక్కడ కాలాలో అక్కడ బాగా కాలింది. చంద్రబాబు కర్మకొద్ది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటితో  అధికారంలోకి వస్తే కేంద్రంలో రెండోసారి కూడా మోడినే అధికారంలోకి వచ్చాడు. దాంతో అప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. తనకు వ్యతిరేకంగా మోడి+జగన్ కలిస్తే ఏమవుతుందో అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే ఏదోరకంగా మోడిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ముందు టిడిపి రాజ్యసభ సభ్యుల్లో నలుగురిని బిజెపిలోకి పంపేశాడు.




వ్రతమూ చెడింది ఫలితమూ దక్కలేదన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్ధితి. నలుగురు రాజ్యసభ ఎంపిలను పంపినా మోడి మాత్రం చంద్రబాబును దగ్గరకు రానీయలేదు. మోడి రాకపోతే పర్వాలేదు అమిత్ షా కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని దగ్గరకు రానీయటం లేదు. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకునైనా మోడితో మళ్ళీ దగ్గరవుదామని అనుకుంటే అదీ సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలోనే  అమిత్ షా కు  కరోనా వైరస్  సోకటంతో ఆసుపత్రిలో చేరాడు. వైరస్ తగ్గి డిస్చార్జి కాగానే మళ్ళీ సమస్య మొదలైంది. దాంతో వెంటనే ఎయిమ్స్ లో చేరాల్సొచ్చింది. రెండు రోజుల క్రితం ఎయిమ్స్ నుండి డిస్చార్జయిన కేంద్ర హోంశాఖ మంత్రి ఇంటికి చేరుకున్నాడు. ఇదే అదునుగా చంద్రబాబు పరామర్శపేరుతో వెంటనే హోంశాఖ మంత్రికి చంద్రబాబు ఫోన్ చేశాడట.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేయటంలో వింత గాని ఆశ్చర్యం కానీ వార్తకానీ ఏమీ లేదు. ఎందుకంటే గడచిన ఏడాదిన్నరగా అమిత్ తో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. కానీ చంద్రబాబుకు  అమిత్ షా ఫోన్ చేస్తేనే వార్త. ఎందుకంటే చంద్రబాబును బిజెపి అగ్రనేతలు కనీసం దగ్గరకు కూడా రానీయటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  అమిత్ షాకు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడిన విషయాన్నే ఇంతగా ప్రచారం చేసుకుంటున్న ఎల్లోమీడియా అమిత్ షా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడితే ఇంకేమన్నా ఉందా ? చంద్రబాబు ఫోన్ చేసి అమిత్ షా తో మాట్లాడాడని ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటున్నది. అమిత్ షా కార్యాలయం అయితే ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నది గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: