హెరాల్డ్ సెటైర్ : పాపం ఈ ఎంపి నోరు కట్టేసినట్లేనా ? తట్టుకోలేకపోతున్నాడా ?

Vijaya
ఈ ఎంపిగారు పార్టీ ఫిరాయించేటపుడు చాలానే అనుకునుంటాడు. కానీ ఏడాది గడిచేటప్పటికి ఏమీ చేయలేక చతికిల పడిపోయాడు. మొన్నటి ఎన్నికల్లో నమ్ముకున్న టిడిపి ఘోరంగా ఓడిపోవటంతో ఏమి చేయాలో తోచలేదు. వెంటనే తేరుకుని తమ కులపెద్దతో మాట్లాడుకుని చాలా స్పీడుగా బిజెపిలోకి ఫిరాయించేశాడు. అంటే ఒక్కడే కాదులేండి మరో ముగ్గురితో కలిపి. బిజెపిలోకి ఫిరాయించిన మిగిలిన ముగ్గురు మాత్రం చాలా లో ప్రొఫైల్లో ఉంటున్నారు. కానీ సుజనా చౌదరి మాత్రం ప్రతి విషయంలోను ఎగిరెగిరి  పడేవాడు. అమరావతి భూముల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, మూడు రాజధానుల విషయం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి అనేక అంశాల్లో చాలా జోరు చూపించాడు. చాలా అంశాల్లో తన మాటే కేంద్రప్రభుత్వంలోని పెద్దల మాట అనే అర్ధం వచ్చేట్లుగా మాట్లాడేవాడు. అదే సమయంలో బిజెపిలోని పెద్దల మాటే తన మాట అని జనాలు అనుకోవాలనేట్లు చాలా ఓవర్ యాక్షనే చేశాడు.




కానీ ఏడాది తిరిగేసరికి సీన్ మొత్తం రివర్సయిపోయింది. చాలా అంశాల్లో సుజనా మాటకు విలువ లేదని తేలిపోయింది. ఎలాగంటే  రాష్ట్రంలో జరిగే చాలా విషయాలకు అసలు సుజనాకు సంబంధం లేదన్నట్లుగా బిజెపి అగ్రనాయకత్వం తేల్చేసింది. మూడు రాజధానుల విషయం, శాసనమండలి రద్దు విషయాల్లో అయితే సుజనా చాలా ఓవర్ యాక్షనే చేశాడు. రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంత వరకు ప్రతి విషయంలోను ఎగిరెగిరిపడిన సుజనా అధ్యక్షునిగా  సోము వీర్రాజు రాగానే చప్పపడిపోయాడు. సుజనా చెప్పే ప్రతిమాటకు ఢిల్లీ నుండి మరో రాజ్యసభ ఎంపి, దక్షిణాధి రాష్ట్రాల అధికారప్రతినిధి జీవిఎల్ నరసింహారావు అప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేశాడు. ఓ రకంగా సుజనా గాలిని  జీవీఎల్ తీసేశాడనే చెప్పాలి. చివరకు సోము రాకతో దాదాపు నోరు మూతపడిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే సోము కొత్త అధ్యక్షునిగా అపాయింట్ అయిన దగ్గర నుండి సుజనా నోరెత్తటమే లేదు. చివరకు వీర్రాజు బాధ్యతలు తీసుకునే సందర్భంలో కూడా కనబడలేదు.




తాజాగా రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న విషయం ఏమిటంటే పార్టీ పరంగా సుజనాను ఏపి రాజకీయాల నుండి తప్పించారట. ఇక నుండి ఏపి రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా  పార్టీ అగ్ర నాయకత్వం చెప్పేసిందట. అందుకనే తాజా వివాదం టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడా నోరిప్పటం లేదు. నిజానికి సుజనా టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిందే ప్రత్యేకమైన టార్గెట్ తో. అదేమిటంటే కేంద్రంలోని అధికారపార్టీలో ఉంటు చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడటం. చంద్రబాబుకు వ్యతిరేకంగా కేంద్రం కేసులను తిరగతోడకుండా చూడటమే ప్రధాన బాధ్యతగా ప్రచారంలో ఉంది.  పనిలో పనిగా తనమీదున్న కేసులు కూడా కోల్డు స్టోరేజీలో ఉంచేయటం కూడా అవసరమే లేండి. ఏ కారణంతో అయితే పార్టీ ఫిరాయించాడో ఆ  అవసరం సుజనాకు ఇంతవరకు వచ్చినట్లు లేదు.




చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడికి మళ్ళీ దగ్గర చేయాలనే టార్గెట్ కూడా ఉన్నప్పటికీ అది సాధ్యం అయ్యేపని కాదని తేలిపోయింది. ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మోడిని చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. పైగా ఏదో పొడిచేద్దామని ఇతర రాష్ట్రాల్లో కూడా తిరిగి మోడికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అవన్నీ మోడి కానీ బిజెపి నేతల్లో ఎవరు కానీ మరచిపోలేదు. అందుకనే బిజెపిలోకి చంద్రబాబుకు పర్మినెంట్ గానే తలుపులు మూసేసినట్లే అనిపిస్తోంది. దాంతో మోడికి దగ్గర కాలేక ఇక్కడ జగన్ దెబ్బలను తట్టుకోలేక చంద్రబాబు నానా అవస్తలు పడిపోతున్నాడు. ఒకవైపు చంద్రబాబుపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నా పాపం సుజనా ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకనే  బిజెపి అగ్రనాయకత్వం సుజనా నోటిని కట్టేసినట్లే అనిపిస్తోంది. పాపం నోటిని అదుపులో పెట్టుకోలేక, జరుగుతున్నది చూస్తు ఊరుకోలేక పాపం సుజనా పడుతున్న అవస్తలు అన్నీ ఇన్నీ కావు ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకు చేసుకున్న మహదేవా అని ఊరికే అన్నారా పెద్దలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: