హెరాల్డ్ సెటైర్ : టిడిపి చివరకు చంద్రబాబు వల్లే ముణిగిపోతుందా ?
అసలు సమస్యను సమస్యగా చూసే తత్వం చంద్రబాబులో లోపించిందనే విషయం అర్ధమైపోతోంది. కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది చనిపోయారన్నది వాస్తవం. ఈ సెంటర్ రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం పోతినేని రమేష్ చౌదరి ఆధీనంలో ఉందన్నది కూడా నిజమే. కాబట్టి డాక్టర్ ను డాక్టర్ గాను ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలి. కానీ చంద్రబాబు, ఎల్లోబ్యాచ్ మాత్రం డాక్టర్ ను కమ్మ సామాజికవర్గంలో ప్రముఖునిగా చూడటంతోనే సమస్య పెరిగిపోయింది. డాక్టర్ మీద చర్యలు తీసుకుంటే యావత్ కమ్మ సామాజికవర్గం మీద ప్రభుత్వం వేధింపులకు దిగుతోందంటూ నానా గోల చేస్తున్నారు. ఇదే రమేష్ ఆసుపత్రికి ప్రభుత్వం కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన రీ ఎంబర్స్ మెంటు నిధులను మంజూరు చేసిన విషయాన్ని చంద్రబాబు అండ్ కో మరచిపోయినట్లుంది. విజయవాడలోనే ఉన్న మరికొన్ని కమ్మ డాక్టర్ల నేతృత్వంలో పని చేస్తున్న కరోనా సెంటర్లకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఇచ్చేస్తోంది.
నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తే అర్ధముంది. అంతేకానీ జరిగిన ప్రమాదంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే దాన్ని కూడా సామాజికవర్గం కోణంలో చూడటం చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ కే చెల్లింది. ప్రమాదానికి డాక్టర్ రమేష్ కు సంబంధమే లేదని యావత్ ఎల్లో బ్యాచ్ అడ్డుగోలుగా వాదిస్తోంది. మరి ఇదే సూత్రం వైజాగ్ ఎల్జీ కంపెనీ విషయంలో ఎందుకు వర్తింపచేయలేదు. ఎల్జీ కంపెనీలో ప్రమాదం జరిగి 10 మంది చనిపోయారు. వెంటనే యాజమాన్యంపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంత యాగీ చేసిందో అందరు చూసిందే. అక్కడేమో బాధితులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదని గోల చేసిన చంద్రబాబు అండ్ కో విజయవాడ ఘటనలో మాత్రం యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. కేవలం డాక్టర్ రమేష్ మీద చర్యలు తీసుకోకూడదనే వాదిస్తున్న చంద్రబాబు అండ్ కో అంటే జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తున్నా లెక్క చేయటం లేదు.
ఆమధ్య వైజాగ్ జిల్లాలోని నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆరోపణలు చేస్తే ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. నిజానికి వివాదం చాలా చిన్నది. దాన్ని సుధాకర్, ప్రభుత్వం పరిష్కరించుకునేదే. కానీ చంద్రబాబు, ఎల్లోమీడియా జోక్యం చేసుకుని దాన్ని ఎస్సీల మీద ప్రభుత్వం వేధింపులుగా మార్చేశారు. దాంతో వివాదం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నది నిబంధన. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా కొందరిని సస్పెండ్ చేసిన ఘటనలున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మరో డాక్టర్ అనితారాణి వివాదంలో కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ జోక్యం చేసుకుని కంపు చేసేసింది. పై ఇద్దరు డాక్టర్ల వివాదంలో వీళ్ళు జోక్యం చేసుకుని ప్రభుత్వం ఎస్సీలను వేధిస్తోందనే కలరింగ్ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.