హెరాల్డ్ సెటైర్ : పై వర్గాల్లో వాళ్ళు మాత్రమే జగన్ కు అక్కా, చెల్లెళ్ళా ? .. మిగిలిన వాళ్ళు కారా ?

Vijaya
పై ఫొటోను జాగ్రత్తగా  చూడండి మహిళా సాధికారత కోసం వైసిపి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో ? ఎంతమంది లబ్ది పొందుతున్నారో, లబ్దిదారులు ఎవరో చెప్పే అడ్వర్టైజ్ మెంటు. ఈ ప్రకటనలో మహిళా సాధికారత కోసం ఏడాదికి తమ ప్రభుత్వం మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నదనే వివరం ఉంది. అలాగే ప్రతి మహిళకు ఏడాదికి ’వైఎస్సార్ చేయూత’ పథకంలో ఎంత మొత్తం అందుతోందనే విషయం స్పష్టంగా ఉంది. పథకంలో లబ్దిదారులు ఎవరయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి మహిళలని ప్రకటనలోనే స్పష్టంగా కనబడుతోంది. పై వర్గాల్లోని పేద మహిళలను ఆదుకోవటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎంతగా శ్రమపడుతోందో  ప్రకటనలో ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్నది. చేస్తున్న పని చెప్పుకోవటంలో, అమలు చేస్తున్న పథకాలను హైలైట్ చేసుకోవటంలో తప్పేలేదు. 



కానీ జగన్ మరచిపోయిన విషయం, మామూలు జనాలకు అర్ధంకాని విషయం ఒకటుంది. అదేమిటయ్యా అంటే పేద మహిళల్లో అగ్రవర్ణ మహిళా పేదలు వేరు, వెనుకబడిన మహిళా పేదలు వేరా అన్నదే ఇక్కడ అనుమానం. పేద మహిళలంటే ఇందులో కులం, మతం ప్రస్తావన ఎందుకు తెస్తున్నది ప్రభుత్వం ? పేదరికానికి కులం, మతంతో పనేముందసలు ?  పేద మహిళలకు చేయూత ఇస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వమే మహిళలను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలని, అగ్రవర్ణాలకు చెందిన మహిళలని రెండుగా విడదీయటం ఏమిటో అర్ధం కావటం లేదు. పేద మహిళలంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి వర్గాల్లో మాత్రమే ఉంటారని, అగ్రవర్ణాల్లో పేద మహిళలుండరని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.



పై వర్గాల్లోని పేద మహిళలకు ఏడాదికి ప్రభుత్వం రూ. 18750 చొప్పున ఖాతాల్లో జమచేస్తోంది. నాలుగేళ్ళల్లో పై వర్గాల్లోని ఒక్కొక్కళ్ళకి   ప్రభుత్వం రూ. 75 వేల ఆర్ధికసాయం చేస్తోంది. వైఎస్సార్ చేయూత పథకంలో నెలకు 20 లక్షల మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. కష్టాల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం సాయం అందిచటం సంతోషమే. కానీ పేద మహిళలు అగ్రవర్ణాల్లో ఉండరని జగన్ ఎలా అనుకున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.  ప్రభుత్వ సాయానికి ప్రాతిపదిక నిజంగా  పేదరికమే  అయితే దానికి కుల, మతాలుండకూడదు. ఒకవేళ జగన్ ఆలోచనల ప్రకారం పై వర్గాల్లోని  పేద మహిళలే జగన్ అక్క, చెల్లెళ్ళయితే అగ్రవర్ణాల్లోని పేద మహిళలెవరు ? చంద్రబాబునాయుడు అక్కా,  చెల్లెళ్ళా ?



పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీల్లో అగ్రవర్ణాల మహిళలను మరచిపోయినట్లే ఉన్నాడు చూస్తుంటే. అందుకనే ప్రతి పథకంలోను ఎంతసేపు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి మహిళలనే జగన్  లబ్దిదారులుగా  మాట్లాడుతున్నాడు. కాబట్టి  కాసింత కళ్ళు తెరిచి అగ్రవర్ణాల్లోని పేద మహిళల గురించి కూడా జగన్ ఆలోచించాలి. మొన్నటి ఎన్నికల్లో వైసిపికి ఓట్లేసిన వాళ్ళల్లో పై నాలుగు వర్గాల మహిళలే కాకుండా అగ్రవర్ణాల మహిళలున్నారన్న  విషయాన్ని కూడా  జగన్ గ్రహించాలి. కాబట్టి పేదలకు సాయం చేసేందుకు ఉద్దేశించిన పథకాల్లో అర్హత నూరుశాతం  పేదరికమే ఉండాలి కాని  ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలని,  అగ్రవర్ణాల్లోని పేదలని విడదీసి అగ్రవర్ణాల్లోని పేదలను వాళ్ళ ఖర్మానికి వదిలేయటం కాదని ఇప్పటికైనా జగన్ గ్రహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: