హెరాల్డ్ సెటైర్ : పై వర్గాల్లో వాళ్ళు మాత్రమే జగన్ కు అక్కా, చెల్లెళ్ళా ? .. మిగిలిన వాళ్ళు కారా ?
కానీ జగన్ మరచిపోయిన విషయం, మామూలు జనాలకు అర్ధంకాని విషయం ఒకటుంది. అదేమిటయ్యా అంటే పేద మహిళల్లో అగ్రవర్ణ మహిళా పేదలు వేరు, వెనుకబడిన మహిళా పేదలు వేరా అన్నదే ఇక్కడ అనుమానం. పేద మహిళలంటే ఇందులో కులం, మతం ప్రస్తావన ఎందుకు తెస్తున్నది ప్రభుత్వం ? పేదరికానికి కులం, మతంతో పనేముందసలు ? పేద మహిళలకు చేయూత ఇస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వమే మహిళలను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలని, అగ్రవర్ణాలకు చెందిన మహిళలని రెండుగా విడదీయటం ఏమిటో అర్ధం కావటం లేదు. పేద మహిళలంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి వర్గాల్లో మాత్రమే ఉంటారని, అగ్రవర్ణాల్లో పేద మహిళలుండరని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
పై వర్గాల్లోని పేద మహిళలకు ఏడాదికి ప్రభుత్వం రూ. 18750 చొప్పున ఖాతాల్లో జమచేస్తోంది. నాలుగేళ్ళల్లో పై వర్గాల్లోని ఒక్కొక్కళ్ళకి ప్రభుత్వం రూ. 75 వేల ఆర్ధికసాయం చేస్తోంది. వైఎస్సార్ చేయూత పథకంలో నెలకు 20 లక్షల మంది మహిళలు లబ్దిపొందుతున్నారు. కష్టాల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం సాయం అందిచటం సంతోషమే. కానీ పేద మహిళలు అగ్రవర్ణాల్లో ఉండరని జగన్ ఎలా అనుకున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రభుత్వ సాయానికి ప్రాతిపదిక నిజంగా పేదరికమే అయితే దానికి కుల, మతాలుండకూడదు. ఒకవేళ జగన్ ఆలోచనల ప్రకారం పై వర్గాల్లోని పేద మహిళలే జగన్ అక్క, చెల్లెళ్ళయితే అగ్రవర్ణాల్లోని పేద మహిళలెవరు ? చంద్రబాబునాయుడు అక్కా, చెల్లెళ్ళా ?