ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఓ లేఖ వెంటాడుతోంది. కరోనా వైరస్ కారణంగా నిమ్మగడ్డ స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు కొందరు వైసిపి ప్రముఖులు అప్పటి కమీషనర్ పై విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నేపధ్యంలోనే కేంద్రహోంశాఖకు నిమ్మగడ్డ పేరుతో ఓ లేఖ అందటం రాష్ట్రంలో పెద్ద సంచలనమే రేగింది. నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖలో ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసేట్లుగా ఆరోపణలు, విమర్శలున్నాయి.
లేఖ ఎప్పుడైతే బయటపడిందో వెంటనే కలకలం రేగింది. ఇదే విషయమై ఏఎన్ఐ వార్తా సంస్ధతో నిమ్మగడ్డ మాట్లాడినపుడు ఆ లేఖకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను లేఖ రాయలేదన్నారే కానీ తనపేరుతో వెళ్ళిన లేఖపై విచారణ జరపించాలని డిజిపికి ఫిర్యాదు మాత్రం చేయలేదు. నిజానికి తాను రాయని లేఖ తన పేరుతో వెళ్ళినపుడు నిమ్మగడ్డ చాలా సీరియస్ గా రియాక్డవ్వాలి. కానీ నిమ్మగడ్డ అసలా లేఖనే పట్టించుకోనే లేదు. లేఖపై ఎంత రాద్ధాంతం జరిగినా రియాక్టవ్వకపోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.
సరే తర్వాత జరిగిన వ్యవహారాలు అందరికీ తెలిసిందే. ఇపుడు తాజాగా అదే విషయాన్ని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు చేరిన లేఖలో మాజీ కమీషనర్ సంతకాన్ని పోర్జరీ చేసినట్లుగా ఫిర్యాదులో ఆరోపించాడు. నిమ్మగడ్డ రాయని లేఖ గుంటూరులోని టిడిపి కార్యాలయంలో తయారైందన్నాడు. రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్, ఎంఎల్సీ టిడి జనార్ధనరావు, సీనియర్ నేత వర్ల రామయ్యలే లేఖను తయారు చేశారంటూ విజయసాయి ఆరోపించటం సంచలనంగా మారింది. అయితే ఇన్ని రోజుల తర్వాత కేంద్ర హోంశాఖకు వెళ్ళిన ఉత్తరాన్ని రాసింది తానే అని ఒప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖను నిమ్మగడ్డ రాయకపోయినా ఆయనకు తెలిసే డ్రాఫ్ట్ అయినట్లు ఎంపి ఫిర్యాదులో చెప్పటం టిడిపిలో సంచలనంగా మారింది. నిమ్మగడ్డ సంతకాన్ని, లేఖలో ఉన్న పోర్జరీ సంతకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందని కూడా ఎంపి చెప్పాడు. నిజానికి కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖలోని అంశాలు పక్కాగా రాజకీయ పార్టీ అందులోను చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణల్లాంటి అంశాల్లాగే ఉండటంతోనే అందరికీ అనుమానం వచ్చేసింది.
ఇన్ని రోజులైపోయిన తర్వాత హఠాత్తుగా నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖను విజయసాయిరెడ్డి ఎందుకు బయటకు తీశారనే విషయం అర్ధం కావటం లేదు. అంటే ఇన్ని రోజులు కేంద్రహెంశాఖ ఉన్నతాదికారులతో ఇదే విషయమై పెద్ద కసరత్తే చేసినట్లు అనుమానంగా ఉంది. అందుకనే ఇన్ని రోజులు టైం తీసుకుని తన ఫిర్యాదులో టిడిపి నేతల పేర్లను కూడా చెప్పేశాడు. మొత్తం మీద నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖ తొందరలోనే సంచలనం సృష్టించేట్లే ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: