మంచిమాట: శరీరానికి శ్రమ పెట్టినప్పుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది..!

Divya
అనగనగా ఒక అడవి ఉండేది. అందులో ఒక పెద్ద రావిచెట్టు.. దాని పైకి ఒక పిల్ల కాకి వచ్చి చేరింది.అక్కడ చాలా కాలంగా నివశిస్తున్నా పక్షులన్నీ పెద్దకాకి పెద్దమ్మను చూసి భయపడేవి. అది ఏంటో తెలియదు కానీ... ఈ పిల్ల కాకి ని చూసి ముచ్చట పడిన ఆ పెద్ద కాకి దానికి తన గూటి పక్కనే చోటిచ్చింది. పిల్లకాకి రోజు సూర్యోదయానికి ముందే బయటకు వెళ్ళిపోయేది. పెద్ద కాకి మాత్రం బారెడు పొద్దెక్కినా తన గూటి నుంచి బయటకు వచ్చేది కాదు. ఆ చెట్టు మీద ఉన్న మిగతా పక్షులన్నింటిని బెదిరించి అవి తెచ్చిన ఆహారాన్ని తింటూ కాలక్షేపం కొనసాగించేది. రోజంతా ఎక్కడెక్కడో తిరిగి తన గూటికి రాగానే పిల్ల కాకి హాయిగా నిద్రపోయేది.

పెద్ద కాకి కి మాత్రం ఎప్పుడు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఓరోజు పిల్ల కాకి ని చూసి చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నా తెల్ల వారక ముందే వెళతావు. చీకటి పడే వేళకు ఇంటికి చేరుకుంటావు వెంటనే గాఢనిద్రలోకి పోతావు. నాక్కూడా నీలాగా నిద్ర పట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్తావా అంటూ అడిగింది. పెద్ద కాకి పెద్దమ్మ... అదేమంత పెద్ద రహస్యం కాదు. ఈరోజు నువ్వు నాతో వస్తే నీకు నిద్ర పట్టేలా చేస్తా అంది. పెద్ద కాకి సరే అని పిల్లకాకి వెంట బయలుదేరింది. మళ్లీ చీకటి పడే లోపు పిల్లకాకి తో కలిసి ఇంటికి చేరుకుంది.

రాగానే గాఢ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేవగానే పెద్ద కాకి... నువ్వేమి మాయ చేసావో కానీ .. నిన్న రాత్రి నాకు ఎప్పుడూ లేనంత నిద్ర పట్టింది. ఇందులో మర్మం ఏమిటో నాకు చెప్పవా అంటూ పిల్లకాకినీ అడిగింది. ఏం లేదు పెద్దమ్మ నిన్న రోజంతా నాతోపాటు ఎగురుతూ నీ ఆహారం కోసం శ్రమించావు. అందుకే హాయిగా నిద్ర పోయావు. అంటూ పలికింది పిల్లకాకి ఇక అప్పటి నుంచి శ్రమించటం నేర్చుకుంది పెద్ద కాకి తన జీవితకాలమంతా హాయిగా నిద్రపట్టేలా చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: