మంచిమాట : దేనినైనా అందరితో పంచుకోవడంలోనే అసలైన ఆనందం దాగి ఉంది..!

Divya
అనగనగా ఒక మామిడి చెట్టు. దాని మీద ఒక కోతి. ఆ చెట్టు నిండా మామిడి పండ్లు, ఆ పండ్లు తింటూ అటుగా పోయే జంతువులను వూరిస్తూ ఉండేది కోతి. కానీ వాటిలో ఏది అడిగినా ఒక్క పండు కూడా ఇచ్చేది కాదు.
   
ఒకరోజు లేడీ "  కోతి బావా! ఒక మామిడి పండు ఇవ్వవా"అని అడిగింది..మా అమ్మమ్మ తిని పాడేసిన మామిడి టెంక వల్ల ఈ చెట్టు పెరిగింది. ఇది నా సొంతం. దీని పండ్లు ఎవ్వరికీ ఇవ్వను పో! పో! అంది కోతి.
మరోసారి మామిడి పండ్లు అడిగిందని కుందేలుని కసురుకుంది.. ఏనుగును ఏవగించుకుంది. ముళ్లపంది ని తిట్టి పోసింది. జంతువులన్నింటికీ కోతి మీద పీకల వరకు కోపం వచ్చింది. అవన్నీ తగిన సమయం కోసం ఎదురు చూడసాగాయి.
ఒకనాడు పక్కనున్న అడవి నుంచి కోతి బంధువు కొండముచ్చు ఒకటి వచ్చింది. పిన్నికి జబ్బు చేసిందని చెప్పింది. పిన్ని అంటే కోతి కి ఎనలేని ప్రేమ. వెంటనే చెట్టుకున్న కొన్ని పండ్లను కోసుకొని, బుట్టలో వేసుకొని బయలుదేరింది కోతి. ఎవరిని మామిడి చెట్టు వద్దకు రానివ్వకుండా చూడమని కొండముచ్చును కాపలా పెట్టి వెళ్ళింది.
కోతి వెళ్లేసరికి పిన్ని బాగానే ఉంది 'అనారోగ్యమా? నాకా?'అని ఎదురు ప్రశ్నించింది పిన్ని. కోతి ఆశ్చర్యపోయింది. కొండముచ్చు అబద్ధం ఎందుకు చెప్పిందబ్బా?!' అనుకుంటూ తిరిగి వచ్చింది. అది వచ్చేసరికి కొండముచ్చు మామిడి పండ్లన్నీ తినేసింది. కాయలను రాల్చేసింది. కొమ్మలన్నీ విరి చేసింది. కోతిని అల్లంతదూరానా చూస్తూనే కొండముచ్చు పారిపోయింది. బోసిపోయిన మామిడి చెట్టును చూసి కోతికి ఏడుపు వచ్చింది. కొండముచ్చును నమ్మి మోసపోయినందుకు బాధపడింది. దూర ప్రయాణం చేసి వచ్చినందుకు కోతికి ఆకలితో కడుపు మండిపోతోంది. వెంటనే లేడి దగ్గరికి పోయి 'చాలా ఆకలిగా ఉంది రెండు అరటిపండ్లు ఇస్తావా?' అని అడిగింది కోతి.
 "అరటి చెట్టు ని మా తాతయ్య పెంచాడు. అది నా సొంతం, దీని పండ్లు నీకు ఇవ్వటానికి కుదరదు పో !"అంది లేడీ.
కోతికి గొంతెండి పోయి ఏనుగు దగ్గరకు పోయింది.'ఏనుగు బావ! నీ చెట్టు నుంచి కొబ్బరి బొండం నీళ్ళు ఇస్తావా? చాలా దాహంగా ఉంది'అని అడిగింది కోతి.
అబ్బేబ్బే.... ఇవి నీకు ఇచ్చేవి కావు. ఇది మా వంశానికి చెందిన చెట్టు. ఇక పోయిరా.. అని కసురుకుంది ఏనుగు.
ఆకలి చల్లారలేదు. దాహం తగ్గలేదు . ఎండ మండిపోతోంది. కోతి గబగబా కుందేలు ఇంటి దగ్గరకు పరుగు తీసింది.
కుందేలు తమ్ముడు! ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. నీ ఇంటిలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. చోటు ఇవ్వవా?'అని బతిమాలింది కోతి.' అయ్యో! అదెలా కుదురుతుంది. ఈ ఇల్లు నా కుటుంబానికి సొంతం. మా ఇంటికి ఈవేళ బంధువులు కూడా రాబోతున్నారు. నీకు చోటు ఇవ్వటం కుదరదు'అని తరిమింది కుందేలు.
 
జంతువులన్నీ ఇలా ఎందుకు చేశాయో కోతికి అర్ధమైంది. తనకు తగిన బుద్ధి చెప్పాయని తెలుసుకుంది. తన బుద్ధిని మార్చుకుంది. కొన్నాళ్ల తర్వాత మామిడి పండ్లు మల్లి  కాసాయి. అవి పండాయి. కోతి జంతువులన్నింటినీ పిలిచింది. తన చెట్టు కింద మామిడి పండ్లు విందు ఏర్పాటు చేసింది. జంతువులన్నీ చాలా ఆనందించాయి. దేనినైనా అందరితో కలిసి పంచుకోవడంలో ఆనందం ఉందని కోతి తెలుసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: