మంచి మాట: మంచి, చెడు.. బొమ్మ బొరుసు లాంటివి..!

Divya
పూర్వం ఒక మహా రాజు ఉండేవాడు. ఆయన ఒక రోజున రాజభవనం పై అంతస్తులో బాల్కనీలో నిలబడి ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. ఆ రోజున గాలి ఎక్కువగా ఉండి చలిచలిగా ఉంది. అచ్చట ఎక్కువ సేపు నిలబడ లేక ఆయన గదిలోకి పోదామని ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. హఠాత్తుగా పెద్ద గాలి వీచడం వల్ల తెరచిన ఆ తలుపు దబేలునా మూసుకొని పోయింది. తలుపు సందులో ఆయన వేలు ఉండుట చేత, అది తెగి కింద పడిపోయింది. ఆయన బాధతో విలవిలలాడి పోతూ అరవడం మొదలు పెట్టాడు. ఆ హడావిడికి రాజోద్యోగులు ముఖ్యమంత్రి కూడా పరిగెత్తుకొని వచ్చారు. అందరూ ఆయనకు సానుభూతి తెలియజేస్తూ బాధపడుతున్నారు.
అప్పుడు ముఖ్యమంత్రి అయ్యా బాధపడకండి ..జరిగింది ఏదో మనమంచికే జరిగింది. అన్నాడు. ఆ మాటలకు రాజు గారికి అంతులేని కోపం వచ్చింది. వెంటనే ఆయన ఈ దుర్మార్గున్ని తీసుకెళ్లి చెరసాలలో బంధించండి. అని ఆజ్ఞాపించారు అతన్ని జైల్లో పెట్టిన వెంటనే ఒక కొత్తమంత్రిని ఆ స్థానంలో నియమించాడు రాజు
కొన్నాళ్ళ తరువాత రాజుగారు తన పరివారంతో సహా అడవిలోనికి వేటకు వెళ్ళాడు. వాళ్లు అడవిలో తిరుగుతుండగా అచ్చటి కోయవాళ్ళు వచ్చి రాజు గారిని బంధించి మేం మా దేవతకి బలి ఇవ్వడానికి ఒక మంచి మనిషి కోసం వెతుకుతున్నాం. ఇయ్యాల ఈ మనిషి దొరికిండు.. అని ఆయన శరీరమంతా పరీక్షగా చూడ్డం మొదలు పెట్టారు. చివరకు తెగిన వేలు వాళ్ల కంట పడింది. ఛీ ఛీ ఈ మనిషికి వేలు లేదు. మా దేవత కి కోపం వచ్చింది. అని ఆయన ను  పక్కకునెట్టి అన్ని విధాలా బాగున్న  కొత్త మంత్రిని తీసుకొని పోయి వాళ్ళ దేవతకు బలి ఇచ్చారు.
వేటనుండి కోటకు చేరినరాజు వెంటనే చెరసాలకు వెళ్లి మన పాత ముఖ్యమంత్రి గారిని విడిపించి ఇక్కడకు తీసుకొనిరండి. అని సేవకులను పురమాయించాడు. కాసేపట్లో వచ్చి ఎదుట నుంచున్న మంత్రితో రాజు నీవు చెప్పింది. నిజమే.. ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది. నీవు మామూలుగా మా కొలువులో ముఖ్యమంత్రిగానే కొనసాగవచ్చు. అన్నాడు.
ఆ తెలివైన మంత్రి చిరునవ్వుతో చిత్తము మహారాజా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. అన్నాడు.. కాబట్టి మంచి చెడు అనేవి బొమ్మ బొరుసు లాంటివి.. ప్రతి ఒక్కరు మంచినైనా, చెడు నైనా స్వీకరించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: