మంచిమాట: ఆలోచించనిదే ఏ పని చేయకూడదు..!

Divya
ఒక అడవిలో ఒక తెల్ల కుందేలు ఉండేది. అది చాలా పిరికిది. చిన్న చప్పుడు అయితే చాలు ఎంతో భయపడి పోయేది. ఒక రోజున అది ఒక మామిడి చెట్టు కింద పడుకొని ఉంది. చెట్టు నిండా బోలెడు మామిడి కాయలు ఉన్నాయి. ఆ చెట్టు నుండి ఒక పండు రాలి క్రింద పడింది. భయపడిన కుందేలు ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. కుందేలు కొండ విరిగి దాని మీద పడింది అనుకొంది.
కొండ విరిగి మీద పడుతోంది రోయ్.. పరిగెత్తండి అంటూ పరుగుతీసింది. ఇది విన్న జింకలు కొన్ని దాని వెనక పరిగెత్తడం మొదలు పెట్టాయి. వాటి వెనుక గుర్రాలు, ఒంటెలు వాటి కుటుంబాలతో పరిగెడుతున్నాయి. ఇంతలో ఒక ఏనుగు మంద వీటిని చూసి ఏమిటి సంగతి? మీరంతా ఎందుకు పరిగెడుతున్నారు? అని అడిగాయి. ఆకాశం విరిగిపడుతోంది .మేమంతా పరిగెడుతున్నాము..మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే మీరు కూడా మాతో రండి అన్నాయి.
వీటి వెనకాలే నక్కలు, తోడేలు బయలుదేరాయి. నక్కలు కాస్త తెలివైనవి కదా! అందులోని ఒక ముసలి నక్క తమ రాజ సింహం వద్దకు జంతువులన్నింటిని తీసుకొని వెళ్ళింది. జంతువులన్నీ రాజు గారి గృహం వద్దకు వచ్చాయి. ఆ గోలకి సింహం బయటకు వచ్చి మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు? అని అడిగింది.

మహాప్రభో కొండ విరిగి పడుతోంది! మీరు ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి అని మొర పెట్టుకున్నాయి. కొండ విరిగి మీద పడుతున్నదని మీకు ఎవరు చెప్పారు. అని అడిగింది సింహం. అదిగో ఆ తెల్ల కుందేలు చెప్పింది అన్నాయి జంతువులు. నీవు కొండ ఎక్కడ విరిగి పడుతూ ఉంటే చూసావో.. అక్కడికి నన్ను తీసుకువెళ్ళు. అంది సింహం కుందేలు తో. అప్పుడు కుందేలు సింహాన్ని మిగతా జంతువులు కూడా తీసుకొని ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చుట్టు పక్కల అంతా వెతికగా సింహానికి  ఒక మామిడి పండు కనిపించింది.
అంతేకానీ ఇంకేమీ కనిపించలేదు. అప్పుడది కుందేలుతో ఈ మామిడి పండు నీ మీద పడింది దీన్ని చూసి నీవు ఆకాశం విరిగిపడుతుందా అని భయపడ్డావు అందర్నీ భయపెట్టేశావు అంది సింహం. అక్కడున్న జంతువులన్నీ మా బుద్ధి తక్కువ నీ మాటలు నమ్మి పరిగెత్తాము అని అన్ని జంతువులను తిట్టుకుంటూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: