మంచి మాట : నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష..

Divya
ఒక ఊర్లో ఒక బీద దంపతులు ఉండేవారు. వారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడి పురిటిలో తల్లి చనిపోయింది. అందుచేత చిన్నప్పటి నుండి ఆ బాలుడి బాగోగులను తండ్రి చూసుకునేవాడు. ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు తండ్రి. ఏ చెడు అలవాట్లు లేకుండా వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. అతను కష్టపడి పనిచేసి అందరి మెప్పును పొందుతూ వేరే ఊర్లో ఉంటున్నాడు. కానీ అతనికి పల్లెటూర్లో ఉన్న తండ్రి అంటే పూర్తిగా ఇష్టం లేకుండా పోయింది. కొన్నాళ్ళ, తర్వాత మంచి కట్నంతో ఒక పట్నం పిల్ల అతనికి భార్యగా వచ్చింది. మరి కొన్నాళ్ళకు వాళ్లకు ఒక చక్కని కొడుకు పుట్టాడు.
పల్లెటూర్లో ఒంటరిగా ఉండలేక ముసలి తండ్రి  పట్నంలోని తన కొడుకు దగ్గరకు చేరుకున్నాడు. తన ముసలి తండ్రి వల్ల గౌరవం తగ్గిపోతుందని ఎంతో బాధపడి పోయేవాడు. ముసలి వాణ్ణి దొడ్లోనీ ఒక పాకలో ఉంచి , మిగిలిపోయిన , పాడైపోయిన పదార్థాలని అతనికి తినటానికి ఇచ్చేవాడు. అతడు కట్టుకోవటానికి తన, పాత బట్టలను ఇస్తుండేవాడు .

చంటివాడు చిన్నప్పటినుండి తాతగారితో చనువుగా ఉంటూ ఆయనతోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేసేవాడు. 10 సంవత్సరాల వయస్సు నుండి ఇంట్లోని పరిస్థితులన్నీ వాడికి అర్థం అవుతున్నాయి. పాపం తాతగారిని వీళ్ళు ఎంతో బాధ పెడుతున్నారు. ఆయన్ని ఒక ముసలి వాడి లాగ చూస్తున్నారు. అనుకొని ఎంతో బాధ పడుతూ ఉండేవాడు.
ఒక రోజునచ లి ఎక్కువగా ఉండి ముసలి తాత వణుకుతున్నాడనీ ఆ మనవడు తండ్రి రగ్గును తీసుకెళ్లి తాతకు ఇద్దామనుకున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన తండ్రి వానీ ఉద్దేశం తెలుసుకుని అది నా కంబలి దాన్ని ఇవ్వద్దు. ఇదిగో ఆ పాత కంబళిని ఇచ్చి రా అన్నాడు. ఇంకా తప్పనిసరై వాడు ఆ కంబళినే,తాత కు ఇచ్చి వచ్చాడు. కానీ వాడి మనసుకు ఆ పని నచ్చలేదు. చాలా సేపు బాధపడ్డాడు.
మర్నాడు ఒక కత్తెర తీసుకొని తన తండ్రి తాలూకు రగ్గుకూ బట్టలకూ కన్నాలు చేశాడు. తండ్రి వచ్చి నా బట్టలన్నీ ఇట్లా ఎందుకు పాడు చేసావు. అని గద్దించి అడిగాడు. అప్పుడు పిల్లవాడు నీవు ముసలి వాడి వైన తర్వాత వీటిని నీకు ఇస్తా.. నీవు అట్లాగే కదా మీ నాన్నకి ఇస్తున్నావు. అన్నాడు
అప్పుడు అర్థమయ్యింది.. తాను చేస్తున్న తప్పు.. వెంటనే వెళ్లి తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ముసలి తండ్రి ని ఇంటిలోనికి తీసుకొచ్చి చక్కటి గది ఇచ్చి అతన్ని చక్కగా చూడ్డం ప్రారంభించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: