మంచిమాట : సాధన అంటే ఇలా వుండాలి..

Divya

దక్షిణ భారతదేశంలో తిరువళ్ళువార్ అనే పేరును వినని వారంటూ ఎవరూ ఉండరు . ఎందుకంటే అతడు మహాభక్తుడు ,జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. ఇక వారంలో ఒకరోజును  పూర్తిగా ఆ భగవంతుని సేవకు వినియోగించే వాడు. ఆయన భార్య పేరు వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక చెంబు నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది.

భర్త ఆ చెంబు నిండా నీటిని గాని, సూదిని గాని ఏనాడూ ఉపయోగించలేదు. ఇక  వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి  నాకొక సందేహం వుంది తీరుస్తారా ?  అని అంటూ భర్తను అడిగింది. ఇక సరేనన్నాడు తిరువళ్ళువార్. మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన ఒక చెంబులో నీరు, ఒక సూది ఉంచమనే వారు. కానీ మీరు ఎప్పుడూ చెంబులోని నీటిని గానీ , సూదిని గాని ఉపయోగించడం నేను చూడలేదు. వాటిని పక్కన పెట్టు అనడంలో మీ ఉద్దేశం ఏమిటి ? అనేది నా సందేహం. దీనిని మీరు తీర్చ వలసిందే అని అడిగింది.

ఇక అప్పుడు తిరువళ్ళువార్ చిరునవ్వుతో ఇలా అన్నాడు.. అన్నం పరబ్రహ్మ స్వరూపం . అన్నాన్ని కిందపడేయరాదు. వృధా చేయరాదు.నీవు వడ్డించేటప్పుడు పొరపాటున కింద పడితే, దానిని సూదితో తీసి నీటిలో శుభ్రం చేసి ఆకులో వేసుకోవాలి అని నా ఉద్దేశం. నీవు ఏనాడు కూడా పొరపాటున అన్నాన్ని కింద  పడేయలేదు. అందుకే వీటిని ఉపయోగించే అవసరం నాకు రాలేదు అన్నాడు. ఇక ఆమె సందేహం తీరి, భర్త ఒడిలోనే ప్రాణం వదిలింది.

తిరువళ్ళువార్ అన్నాన్ని బ్రహ్మ గా భావించాడు. అతని భార్య దాన్ని బ్రహ్మభావంతో కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, రెండు రోజులు కాదు ,జీవితాంతం ఆమె వృధా చేయకుండా వచ్చింది. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో చేసినా ఇంతకంటే సాధన వేరొకటి లేదు. ఒక రైతు బియ్యాన్ని పండించడానికి 4 నెలల సమయం పడితే, మనం ఆ బియ్యాన్ని అన్నంగా మార్చడానికి అర్ధగంట సమయం పడుతుంది. కానీ రెప్ప పాటు కాలంలో దానిని వృధా చేస్తున్నాము. రైతు నాలుగు నెలలు శ్రమించి , కష్టపడి పండించిన బియ్యాన్ని మనం ఏమాత్రం ఆలోచించకుండా పడేయడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఎవరు అన్నాన్ని వృధా చేయకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: