వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూరీ జగన్నాథ్ కుటుంబానికి మరింత ప్రాధాన్యత లభించబోతోంది. ఇప్పటికే పూరీ తమ్ముడు గణేష్ వైఎస్ఆర్ సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గణేశ్ కూడా జగన్ కుటుంబానికి సన్నిహితునిగా మారారు. తరచూ జగన్ కుటుంబ సభ్యులను కలవడమే కాకుండా కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో షర్మిల చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఓటర్లను ఆకర్శించాలంటే పూరీ సోదరుడు గణేశ్ కంటే భార్య లావణ్యను రంగంలోకి దింపితే బాగుంటుందన్న ఆలోచనలో వైఎస్ఆర్ సీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అయితే నర్సీపట్నం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలా లేక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయిన సమాచారం. ఎలాగైనా పూరీ జగన్నాథ్‌ను ఒప్పించి లావణ్యను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పూరీ, జగన్ కుటుంబం మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయనడానికి గతంలో అనేక సంఘటలను ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. గతంలో జగన్ ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు వైఎస్ జగన్ పూరీ స్వగ్రామమైన బీకేపల్లిలోనే బసచేశారు. తర్వాత పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల కూడా బీకేపల్లిలోని పూరీజగన్నాథ్ ఇంట్లోనే బస చేశారు. హైదరాబాద్ లో పూరీ కూతురు ఓణీల పండుగకు జగన్ స్వయంగా హాజరయ్యారు.
పూరీ కూడా ఇటీవల విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా టైటిల్స్‌లో తన సోదరుడు గణేశ్.. వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నట్టుగా ఉన్న ఫొటోను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారని ప్రచారం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నట్టు పూరీ తన భార్య లావణ్యను రాజకీయాల్లోకి తెస్తారా? లేక తమ్ముడు గణేష్ కే టిక్కెట్ ఇప్పించుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: