తెలతెలవారుతుండగానే సుప్రభాతాలు, సహస్ర నామ స్తోత్రాలు, భక్తి కీర్తనలు, ప్రత్యేక దినాలలో మరింత భక్తి శ్రద్ధలతో జరిగే సేవలతో తులతూగే పుణ్యక్షేత్రాలు ఇప్పుడు అన్యమతస్తుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ క్షేత్రాల్లో ఇతర మతాల ప్రచారానికి తావు లేనేలేదంటూ అదనుదరొకినప్పుడల్లా చేసే చట్టాలు, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రుల, అధికారుల వాగ్ధానాలు, ప్రకటనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. అన్యమత ప్రచారానికి అడ్డేలేదన్న రీతిలో సాగుతున్న ఈ దుష్ర్పచారానికి తాజాగా ’ఏడుకొండల వాడి సన్నిధి‘గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డాగా మారింది. ఈ విష సంస్కృతికి బీజం నాటిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ హయాం నుండే ఇక్కడ అన్యమతస్తులు టికానా వేసి దర్జాగా తమ పనిని మూడు పువ్వులు ఆరు ప్రచారాలుగా చేసుకుపోతున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల తిరుమలేషునికి సేవ చేసే ఉద్యోగులే అన్యమత ప్రచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం విదితమే. ఇలాంటి ఇంటి దొంగలు ‘ఏడుకొండల వాడి సన్నిధి’లో ఇంకా చాలా మందే ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
ఒకప్పుడు భారతీయ ధర్మం విశ్వవ్యాప్తమైతే ఇప్పుడు ప్రపంచంలోని దేశదేశాల్లో అన్యమత ప్రచారం భారతీయ సమాజం పైనా, ధర్మంపైనా విషయం చిమ్ముతున్నది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు కలియుగ ధైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్న తిరుమలలోనే అన్యమత ప్రచారం రోజరోజుకు వెలుగుచూడటం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి కాదు..రెండు సార్లు కాదు.. పదేపదే ఈ దురలవాటు, దుర్మార్గం ఏడుకొండల వాసుని సన్నిధానాన్ని అపవిత్రం చేస్తున్నాయి.
సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు మాంసాహారులైనప్పటికీ నిర్ణయించుకున్న ముందు ఒకటి రెండు రోజుల నుంచి నిష్ఠగా ఉంటారు. క్షేత్రానికి వెళ్లి తిరిగి ఇళ్లకు చేరి వెంట తెచ్చిన ప్రసాదాన్న ఆయా దైవాల పాదాల చెంత ఉంచి పూజలు చేసి బంధుమిత్రులకు పంచిపెట్టేదాక ఆ ఇంట్లో మద్యం కానీ, మాంసం కానీ, చివరకు పచ్చి కోడిగుడ్డును సైతం ముట్టరంటే ముట్టరు. అలాంటిది ఏకంగా తిరుమల కొండపైకి, భక్తులు అద్దెకు తీసుకునే గదుల్లోనే గత నాలుగు రోజుల క్రితం లభించడంపై అధికారులపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఈ పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే తిరుచానూరు, తిరుత్తణి, శ్రీకాళహస్తి, కాణిపాకం, క్షేత్రాల్లోనూ ఇలాంటివి సాగుతున్నాయన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్న పట్టించుకునే నాథుడే లేడు. అంతేకాకుండా శ్రీశైలం, సింహాచలం, యాదగిరిగుట్ట, అన్నవరం, విజయవాడ, వేములవాడలోనూ ఈ విషమసంస్కృతి కొనసాగుతుండటం శోచనీయం.
మరింత సమాచారం తెలుసుకోండి: