పిటిషన్స్ మాస్టర్ ‘ ఆళ్ల రామకృష్ణారెడ్డి ’ వైసీపీకి గుడ్ బై..?

Vasishta

ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈ పేరు వింటే చాలు.. కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడమే గుర్తొస్తుంది. రాష్ట్రంలో పలు అంశాలపైన ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన ఏం చేసినా పార్టీ కోసం, జగన్ కోసమే చేశారు. జగన్ ను సీఎం చేయడమే తన లక్ష్యమనేవారు. అయితే ఇప్పుడాయన వైసీపీని వీడే యోచనలో ఉన్నారనే వార్త ఆ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకూ ఆళ్ల ఏం చేయబోతున్నారు?


2014లో మంగళగిరి అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున విజయం సాధించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అనంతరం మంగళగిరి శివార్లలోనే రాజధాని అమరావతి నిర్మించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అప్పటి నుంచి రాజధానిలో ఎలాంటి సంఘటన జరిగినా ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుంటూ వచ్చారు. అమరావతిలో నిబంధనలు పాటించడం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పలు పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ లో డీజీపీ ఠాకూర్ స్థల ఆక్రమణ, ఓటుకు నోటు కేసు, సాధికార మిత్ర, సదావర్తి భూములు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, సివిల్ సర్వెంట్లకు భూముల కేటాయింపు, జగన్ పై కోడి కత్తు కేసు దర్యాప్తు... ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు పిటిషన్లను దాఖలు చేసి ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇరికించేందుకు ప్రయత్నించారు.

 

ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించకముందే మంగళగిరిలో 5 రూపాయలకే భోజనం అందించే ఏర్పాటు చేశారు ఆళ్ల. ఓ విధంగా ప్రభుత్వానికి ఇదే స్ఫూర్తి అనే వాదన కూడా లేకపోలేదు. పార్టీకోసం, జగన్ కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. అయితే ఇటీవలికాలంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదు. ఇందుకు కారణం వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవచ్చనే వార్తలే.! మంగళగిరి నుంచి ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు దక్కడం కష్టమేననే ప్రచారం వైసీపీలో ఇంటాబయటా జరుగుతోంది.

 

మంగళగిరిలో టీడీపీకి చెందిన ఉడతా శీను అనే కౌన్సెలర్ తాజాగా వైసీపీలో చేరారు. స్థానికంగా బలమున్న నేత కావడం, చేనేత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జగన్ ఈసారి ఉడతా శీనుకు టికెట్ కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇది తెలుసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. పార్టీకోసం, జగన్ కోసం అహర్నిశలూ శ్రమించిన తనను కాదని, ఈరోజు మరో వ్యక్తికి టికెట్ కేటాయించడాన్ని ఆళ్ల జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. అందుకే పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారట. మరి ఆళ్ల పార్టీని వీడుతారా.. లేక కేవలం సీటు ఖరారు చేయలేదనే అసంతృప్తిలో ఉన్నారా.. అనేది తెలియాల్సి ఉంది. ఎన్ని మనస్ఫర్థలు ఉన్నా పార్టీని వీడేంత సాహసం ఆళ్ల రామకృష్ణారెడ్డి చేయకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: