జపనీస్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న చేపలు

మానవ పరిణామ క్రమంలో మానవాభివృద్ది మాత్రమే కాదు ఇంకా సాంప్రదాయాలు, సంస్కృతి తో పాటు నమ్మకాలు అపనమ్మకాలు శకునాలు అపశకునాలు మూడనమ్మకాలు ఇవన్ని అనేక సహస్రాబ్ధాల కాలంలో పుట్టుకొచ్చాయి అలాగే కొనసాగుతున్నాయి కూడా! ఇది మన దెశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అలాంటిదే జపాన్ వారి నమ్మకం అదీకూడా వాళ్ళలో ఆందోళన కలిగించే విషయం. 

ఓర్‌ఫిష్. సముద్రపాము అన్న పేరున్న చేపలను చూసి జపాన్ వణికిపోతోంది. దాని దర్శనం వారికి అశుభ సంకేతం. దీనివల్ల తమ దేశాన్ని భూకంపాలు, సునామీ ఎక్కడ ముంచెత్తుతుందో అన్న ఆందోళన వాళ్ల కళ్ళలో కనిపిస్తున్నది. ఇంతకీ ఈ చేపకు, జపాన్ వాసుల భయానికి కారణమేమిటి అంటే...పాములాగా ఎన్నో అడుగుల పొడువు ఉండే ఈ చేపలు సముద్ర గర్భం లో 200 మీటర్ల నుంచి కిలో మీటర్ లోతున ఉంటాయి. ఇవి తీరానికి కొట్టుకు వచ్చినా లేక మత్స్యకారుల వలలకు చిక్కినా సముద్ర గర్భం లోతుల్లో ఎక్కడో భూకంపం వచ్చిందని జపనీయులు నమ్ముతారు. 

తాజాగా జపాన్‌లోని తొయామా నదీతీరంలో మరో రెండు ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. దీంతో ఈ సీజన్‌లో కనిపించిన మొత్తం ఓర్‌ఫిష్‌ల సంఖ్య ఏడుకి చేరింది. గతంలో 10.5 అడుగులపొడువున్న  ఓర్‌ఫిష్ తొయామా తీరానికి కేరటాలతో కొట్టుకొని వచ్చింది. 

తర్వాత 13అడుగుల పొడువున్న మరో ఓర్‌ఫిష్ మత్య్సకారుల వలకుచిక్కింది. దీనిని సముద్ర దేవుడి నుంచి వచ్చిన దూతగా జపాన్ ప్రజలు భావిస్తారు. ఈ చేపను రైగు-నో-సుకాయ్ అనికూడా  పిలుస్తారు. వెండిరంగులో మెరిసిపోయే చర్మం, ఎర్రటి మొప్పలు ఈ చేపలకు ఉంటాయి. ఇవి తీరానికి వచ్చాయంటే ఏదో విపత్తు సంభవించబోతున్నదని అక్కడి ప్రజలు భయపడతారు. 

అయితే దీనికి శాస్త్రీయ ఆధారం అయితే ఏదీ లేదు. కానీ వంద శాతం ప్రకృతి విపత్త సంభవించదు అని కూడా చెప్పలేమని ఔజు ఆక్వేరియానికి చెందిన కజుసా సైబా అనే వ్యక్తి చెప్పడం విశేషం. 2011 లో ఈ చేప కనిపించిన తర్వాతే "ఫుకుషిమా భూకంపం" ఆ వెంటనే సునామీ వచ్చాయి. ఆ విపత్తులో మొత్తం 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాదికి ముందు కనీసం పది వరకు ఓర్‌ఫిష్‌లు తీరానికి కొట్టుకొచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవి కనిపిస్తుండటంతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: