కెసీఆర్ జాతీయరాజకీయ ప్రవేశానికి ఫెడరల్ ఫ్రంట్ ఎత్తు పారట్లెదా? ఆదిలోనే హంసపాదు!

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర, కాంగ్రెస్‌ యేతర ప్రాంతీయ పార్టీల - ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తన తొలి ప్రయత్నం ఒడిశా నుంచి ఆయన ప్రారంభించిన యాత్ర కు ఆదిలోనే హంసపాదు పడింది. ఆదివారం నాడు ఒడిసా రాజధాని భువనేశ్వర్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడి అధినేత నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఆయనతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించిన అనంతరం ఇద్దరూ మీడియా సమావేశం నిర్వహించి, సానుకూలత ప్రదర్శించిన విషయం తెలిసిందే.

అయితే, ఇది జరిగిన రెండు రోజుల్లోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ స్థాయిలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పోరాటానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నవీన్ పట్నాయక్ తన ప్రతినిధి బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ ద్వారా తెలియజేశారు.  ఈ మేరకు బీజేడీ పార్లమెంట్ సభ్యుడు సౌమ్యా రంజన్ పట్నాయక్‌ మంగళవారం అమరావతికి వచ్చి మరీ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపారు. తమ నేత అభిమతాన్ని సైతం బాబుకు వివరించారు.

అంతే కాదు ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తోన్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు స్థానంలో పూర్వకాలం పద్దతిలో పేపర్‌ బ్యాలెట్‌ విధానం తిరిగి తీసుకు రావాలని కోరుతోన్న ఏపీ చంద్రబాబు డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జాతీయస్థాయిలో చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.  తాను కూడా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని, మరోసారి బీజేపీ అధికారంలోకి రాకూడదన్నది తమ ముఖ్యమంత్రి అభిప్రాయమని,  తన లేఖలో నవీన్ పట్నాయక్ తన అభిప్రాయాన్ని తన ప్రతినిధి ద్వారా తెలిపారు.  

అలాగే, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల పైనా పోరాడి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈవీఎంల కన్నా, బ్యాలెట్ పేపర్ల పైనే తమకు ఎక్కువ విశ్వాసముందని సౌమ్యా రంజన్ పట్నాయక్ అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేఅంశాన్ని కంప్యూటర్-చిప్‌ లను తయారుచేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాద కరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. ఈ భేటీలో ఢిల్లీలో ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన రావు కూడా పాల్గొన్నారు. 

కేసీఆర్ రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు-ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యుల ప్రమాణస్వీకారాన్ని ముహూర్తాలకు వదిలేసి-పార్టీ బాధ్యతను తన కుమారునికి వదిలేసి శాంతి భద్రతల కోసం ఒక మంత్రిని నియమించి ఫెడరల్ ఫ్రంట్ అంటూ  రాజకీయ యాత్రల,  తీర్ధయాత్రల దారి పట్టటం తెలంగాణా ప్రజల్లో యెహ్యభావం కలిగిస్తున్నట్లు ఎల్లెడలా వెల్లువౌతున్నాయి.  కేసీఆర్ తీరును, ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంలోని ఆలోచనలను, ముందు గానే పసిగట్టి, పశ్చిమ బంగ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మౌనం గానే తిరస్కరించిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: