ఎడిటోరియల్: చంద్రబాబు ప్రయోగానికి ఎదురుదెబ్బ తప్పదా ?

Vijaya

సొంత జిల్లాలో చంద్రబాబునాయుడు చేసిన ఓ ప్రయోగం దారుణంగా దెబ్బతినే అవకాశాలు కనబడుతోంది. జిల్లాలోని పీలేరు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీకి చాలా సంవత్సరాలుగా అందరి ద్రాక్షపండు లాగ మారిపోయింది. గడచిన 20 ఏళ్ళల్లో టిడిపి ఈ నియోజకవర్గంలో గెలిచిందే లేదు. ఎప్పటికప్పుడు కొత్త వారితో ప్రయోగాలు చేయటం, అభ్యర్ధులను మార్చేస్తుండటంతో పాటు గ్రూపుల గోల ఎక్కువైపోవటం కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగానే చెప్పాలి. పై సమస్యల్లో ఎక్కువ భాగం చంద్రబాబు స్వయంకృతమనే చెప్పాలి.

 

చాలా కాలంగా పీలేరులో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో పెద్దిరెడ్డి పుంగనూరుకు వెళ్లిపోయినా పీలేరులో ఆయనకు మంచి పట్టుంది. అదే సమయంలో టిడిపిలో కూడా గట్టి నేతలే ఉన్నారు. కానీ వారిలో చాలామందిని చంద్రబాబు పట్టించుకోలేదు. అవసరం వచ్చినపుడు దగ్గరకు తీయటం తర్వాత వారిని తీసిపడేసినట్లు చూస్తుండటంతో ఒక్కక్కొరుగా పార్టీకి దూరమైపోయారు. జడ్పి మాజీ ఛైర్మన్, మాజీ ఎంఎల్ఏ జివి శ్రీనాధరెడ్డి, ఇక్బాల్ అహ్మద్ ఉదంతాలే అందుకు తాజా ఉదాహరణ.

 

30 ఏళ్ళుగా పార్టీని, నియోజకవర్గాన్నే అంటిపెట్టుకునున్న ఇక్బాల్ ఈమధ్యే వైసిపిలో  చేరారు.  జివి శ్రీనాధరెడ్డి అయితే అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా పార్టీ నేతలకే తెలీదు. వచ్చే ఎన్నికల్లో ఇక్బాల్ కే టిక్కెట్టని చాలాసార్లే చెప్పారు చంద్రబాబు. అలాంటిది హఠాత్తుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తెచ్చారు. పార్టీలో చేర్చుకోగానే నియోజకవర్గానికి ఇన్చార్జిని చేయటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించేశారు. దాంతో ఇక్బాల్ కు షాక్ కొట్టినట్లైంది. పోనీ కిషోర్ ను అభ్యర్ధిగా ప్రకటించే ముందు అందరితో మాట్లాడారా అంటే అదీలేదు. దాంతో నియోజకవర్గంలోని నేతలంతా ఇపుడు కిషోర్ కు వ్యతిరేకమైపోయారు.

 

దానికితోడు కిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ అయ్యారు. అంటే కాంగ్రెస్ తరపున పోటీ చేయకపోయినా చేసే వారి తరపున పని చేయాల్సిందే కదా ? అదే సమయంలో సిట్టింగ్ ఎంఎల్ఏ చింతల రామచంద్రరెడ్డికి బలంగా ఉన్నారు. పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి మద్దతు ఎలాగూ ఉంటుంది. అంటే కిషోర్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, వైసిపి అభ్యర్ధులతో పాటు సొంత పార్టీ నేతలతో కూడా పోరాటం చేయాల్సిందే. దానికి అదనంగా జనసేన, బిజెపి అభ్యర్ధులు ఎలాగూ ఉంటారు.


అన్నింటికీ మించి నాలుగున్నరేళ్ళ పాలనపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత బోనస్. పైగా నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు దాదాపు 30 వేలుంటాయి. అంటే సహజంగానే ముస్లింల్లో ఉన్న  వ్యతిరేకతకు తోడు పార్టీ నుండి వెళ్ళిపోయిన ఇక్బాల్ కూడా చింతల గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు. దాంతో పెద్ద ఓటు బ్యాంకు టిడిపికి దూరమైనట్లే. ఎందుకంటే, ఇక్బాల్ పార్టీ నుండి వెళ్ళిపోయేటప్పుడు తన మద్దతుదారులందరినీ తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ముస్లిం మైనారిటీల దెబ్బ ఖాయంగా కనబడుతోంది. కాబట్టి ఏ రకంగా చూసినా చంద్రబాబు ప్రయోగం వికటిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: