హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన రాజీనామా పంచాయితీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. పీసీసీ చీఫ్ బొత్స ఇప్పటికే ధర్మాన పనిమీద ఢిల్లీ చేరుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌ను కూడా ఢిల్లీకి రావల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు వర్తమానం పంపారు. ఢిల్లీ కదలికలను బట్టి ధర్మాన వ్యవహారం కాస్త క్లైమాక్స్ కు చేరుకున్నట్లేననీ అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన బొత్స కాంగ్రెస్ పెద్దల్ని కలిసి ధర్మాన రాజీనామాపై చర్చించినట్లు తెలుస్తోంది.
రాజీనామా చేస్తే తలెత్తె పరిణామాలపై కూడా బొత్స ఢిల్లీ పెద్దలకు పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. ఇక్కడ హైదరాబాద్ లో కూడా రాష్ర్ట మంత్రులు 24మంది ఒక జట్టుగా ఏర్పడి సీఎంను కలిసి, ధర్మాన రాజీనామా, సీబీఐ చేస్తున్న అభియోగాలపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కు ఢిల్లీకి రావల్సిందిగా ఆహ్వానం వచ్చింది.
ధర్మాన రాజీనామా, రాష్ర్టంలో నెలకున్న వివిధ సమస్యలు, పార్టీ పటిష్టతకు తీసుకోవల్సిన తదితర అంశాలపై చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలో పెద్దయెత్తున చర్చ సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ధర్మాన రాజీనామా, మిగతా మంత్రులపై వచ్చిన అభియోగాలపై మాట్లాడవచ్చని తెలుస్తోంది. అయితే, ఇప్పటి దాకా సీబీఐని తాము వాడుకోవడం లేదనీ, అది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది.
ధర్మాన, మిగతా మంత్రుల విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా సీబీఐ కాంగ్రెస్ ఆడిస్తున్నట్లుగా ఆడుతున్న సంస్థ అని తేలి, కాంగ్రెస్ బద్నాం అయ్యే ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన ఢిల్లీ పెద్దలు...ధర్మాన రాజీనామాను సీఎం కిరణ్ కోర్టులోకి వేసేందుకు మొగ్గుచూపవచ్చని తెలుస్తోంది. ధర్మాన రాజీనామాపై సీఎం కిరణ్ నిర్ణయానికి వదిలి వేసి...కాంగ్రెస్ పెద్దలు చేతులు దులుపుకోవాలనుకుంటున్నట్లు పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. కిరణ్ గురువారం నాడు ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీ పెద్దల్ని కలసిన అనంతరం కిరణే ధర్మాన రాజీనామా అమోదానికి గవర్నరుకు సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది.
మొత్తానికి కళంకిత మంత్రుల వ్యవహారంలో అధిష్టానం అంటీముట్టనట్లుగానే వ్యవహారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మాన రాజీనామా అమోదిస్తే అరెస్టు కాక తప్పదు. మిగత నలుగురు మంత్రులదీ అదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో ధర్మాన రాజీనామా వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఖాయం.
మరింత సమాచారం తెలుసుకోండి: