బాబు తాజాలేఖ వైఎస్ ఫ్యామిలీకే అంకితం!
మరి ప్రధానమంత్రికి లేఖ రాసిన ఉద్దేశం ఏమిటో కానీ.. మొత్తం ఆరు పేజీల లేఖలో మూడు పేజీల్లో వైఎస్ కుటుంబం గురించి చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు! రాష్ట్ర విభజనకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆ తర్వాతి వంతు వైఎస్ జగన్ ది అని విమర్శించిన చంద్రబాబు నాయుడు వైఎస్ విజయమ్మకు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై ప్రధానిని నిలదీశారు! ఆమెకు ఏ విధంగా అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రశ్నించారు! మరి ఇప్పుడు సమస్య రాష్ట్ర విభజన గురించినా? లేక ప్రధానమంత్రి మంత్రి అపాయింట్ మెంట్ లు ఇవ్వడం గురించినా? అనే అనుమానం వస్తుంది.
ఆరు పేజీల లేఖ రాస్తే దాంట్లో మూడు పేజీల్లో వైఎస్ కుటుంబం గురించి విమర్శించిన చంద్రబాబు నాయుడు మరో మూడు పేజీల్లో తన దీనస్థితి గురించి, తనకు, తన ఎంపీలకు ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం గురించి చెప్పుకున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ఈ లెటర్ ఏదో తెలుగు జాతిని ఉద్దరిస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు! బాబు తాజా లేఖతో రాష్ట్ర విభజన ఆగుతుందన్నట్టుగా సీమాంధ్ర తెలుగుదేశం నేతలు గొప్పలకు పోతున్నారు. "మా బాబుప్రధానమంత్రికి మరో లేఖ రాశాడు..' అని ఘనంగా చెప్పకుంటున్నారు. మరి దీంట్లో వైఎస్ ఫ్యామిలీని విమర్శించడం తప్ప .. రాష్ట్ర ఉద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలేమీ లేవనే విషయాన్ని సగటు ప్రజలకు తెలియకుండా దాచేయాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు.