అమిత్ షాపై దాడి వెనుక కుట్ర..!?

Vasishta

అమిత్ షాపై టీడీపీ కార్యకర్తల దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక ప్రత్యేకహోదా నిరసనల్లో భాగంగా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారా..? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోన్న చర్చ.. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని చేధించుకుని మరీ అలిపిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు అమిత్ షా కాన్వాయ్ లోని కారు అద్దాలు పగలగొట్టారు. అంతేకాదు.. కర్రలతో దాడిచేసినట్టు విజువల్స్ లో స్పష్టమైంది.


కర్ణాటక ఎన్నికల ప్రచారం అనంతరం నేరుగా అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్ షా రాకను తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కొంతమంది.. అలిపిరి సర్కిల్ దగ్గర పోలీసు వలయాన్ని చేధించుకుని మరీ అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకున్నారు. వెనుకనున్న బీజేపీ నేత కారును ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ దాడి ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాడులకు టీడీపీ వ్యతిరేకమని ..శాంతియుత  పంధాలో ఉద్యమం ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్ షా పై దాడి ఘటనలో బాధ్యులైన టీడీపీ కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.  అయితే చంద్రబాబు ప్రకటన చేసిన కొద్ది సేపటికే..తిరుపతి ఎమ్మెల్యేలే ఆ దాడి చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడం విమర్శలకు తావిస్తోంది.


మరోవైపు హోంమంత్రి చినరాజప్ప అసలు అమిత్ షా వాహనంపై రాళ్ల దాడే జరగలేదన్నారు. కేవలం వెనకున్న వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు వేశారన్నారు. అది కూడా బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే జరిగిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ తరహా ఘటనలు ప్రేరేపిస్తూ చూస్తూ ఊరుకునేది లేదని హోంమంతి హెచ్చరించారు. టీడీపీ ముసుగులో కొంతమంది ఈ తరహా దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.


బీజేపీ స్థానిక నేతలు ఈ దాడి ప్రీప్లాన్ డ్ ఎటమ్ట్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. . ముఖ్యమంత్రి చంద్రబాబు,, హోంమంత్రి చినరాజప్ప పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు నిదర్శనం అంటున్నారు.అమిత్ షా వస్తున్నట్టు పోలీసులకు మందుస్తు సమాచారం ఉన్నా.. ఎలాంటి భద్రతా చర్యలుచేపట్టకపోవడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రహోంశాఖ రాష్ర్ట ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు దాడి నేపథ్యంలో ఏపీలో మరోసారి బీజేపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: