ఎ(క)రువు:అయ్యయ్యో అన్నదాతకు ఎంత కష్టం..ఎంత నష్టం

 హైదరాబాద్: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ముందుచూపు లేనితనం ఫలితం రైతులకు ఎరువు కరువైంది. రాష్ర్టంలోని రైతాంగం యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతిఏటా రైతులు ఎరువుల కోసం రోడ్లెక్కుతున్నారు. అయినా, అధికారులు, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులకు కావల్సినంతగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామనీ పాలకులు చెబుతున్న చిలుకపలుకులు సచివాలయం గేటు దాటడం లేదు. ఎరువుల కోసం రైతన్న రాత్రింబవళ్లు లైన్లో నిల్చుంటున్నాడు. పోలీస్ స్టేషన్లో రైతులను నిలబెట్టించి ఎరువులు ఇస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా వేరే చెప్పనక్కర్లేదు. ఎరువులు, విత్తనాలు దొరక్క రైతన్న ఆత్మహత్య చేసుకున్న సంఘటలను కూడా తెలంగాణ జిల్లాలో చూశాం. వర్షాభావం వల్ల రైతులు ఎక్కువగా సాగు చేయడం లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయం సాగు చేసినట్లయితే రైతుకు ఈ ప్రభుత్వం విత్తనాలను, ఎరవులను ఏ మేరకు సరఫరా చేసేదే వేరే చెప్పనక్కర్లేదు.  ప్రభుత్వ ప్రణాళిక 4లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దీనిలో సగం కూడా సరఫరా చేయలేదనీ తెలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో యూరియా ఎరువుల కొరత తీవ్రమైంది. సీజన్ వచ్చిందంటే చాలు రైతులు పొలం పనులు వదిలి ఎరువుల కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు, లేదంటే పోలీస్ స్టేషన్ల వద్దకు పరుగులు తీయాల్సిందే. యూరియా వేసేందుకు వరికి అదును దాటుతోంది. రాష్ర్టంలో ఎన్ని వేల ఎకరాల సాగు భూములున్నాయి. ఏ సీజన్ లో రైతు ఏ ఏ పంటను సాగు చేస్తాడు. వాటికి ఎన్ని మెట్రిక్ టన్నుల విత్తనాలు, ఎరువులు కావాలో కూడా అధికారులకు తెలియకపోవడం నిజంగా సిగ్గు చేటుకరమైన విషయం. సాగు విస్తీర్ణం విషయాన్ని అంచనా వేయలేనప్పుడు వ్యవసాయాధికారులుండటం ఎందుకు మరి. అధికారుల తప్పిదం వల్ల అన్నదాతలు అనేక అవస్తలకు గురికావల్సి వస్తోంది. అమాత్యులు మాత్రం రైతులకు సరిపడు ఎరువులు సరఫరా చేస్తున్నట్లు లెఖ్కలు చెబుతున్నారు. రైతు దగ్గరకు వచ్చే సరికి సక్రమంగా అందడం లేదు. కాంప్లెక్సు ఎరువుల ధరలను పెరిగిన కారణంగా రైతులు పంటలకు కాంప్లెక్సు ఎరువుల మోతాదును తగ్గించి యూరియా మోతాదును పెంచడం వల్ల కొంత కొరతకు కారణంగా తెలుస్తోంది. రోజుల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రైతన్న యూరియా కోసం కళ్లో వొత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ రైతన్నకు శాపంగా మారింది. వర్షాలు కురువలేదు. కురిసిన కొద్దిపాటి వర్షానికైనా పంటలు సాగు చేద్దామంటే విత్తనాలు లేవు, ఎరువులు దొరకవు. పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నా కూడా ఒక సంచి కూడా దొరకడం లేదనీ రైతన్న క‘న్నీటి’ పర్యంతమవుతున్నాడు. యూరియా కొరత లేకుండా చూస్తున్నామనీ పాలకులు చెబుతున్నారే తప్ప వాస్తవానికి అది జరగడం లేదు. ఇది ఈ ఏడే కాదు ప్రతిఏడే ఇదే జరుగుతోంది. యూరియా కోసం మన అమాత్యులు కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం మాత్రం ఇచ్చిన దాఖలాలు లేవు. కేంద్రంలోని యూపిఏ సర్కర్ ఉన్నదంటే మన రాష్ర్ట ప్రజల చలవనే. అయినప్పటికీ మన రాష్ర్టం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. మన రాష్ర్టానికి కావల్సినంతగా ఎరువులను తెప్పించేందుకు రాష్ర్టరైతుల తరుపున పోరాటాలు చేయాలి. రైతు ఎరువు కోసం ఇక్కడ యుధ్దం చేస్తున్నాడు. పాలకులు కేంద్రంతో చేస్తే తప్పేముంది. రైతు ఇప్పటికే అనేక కష్టాలు పడ్డాడు. పడ్డ నష్టం చాలు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రైతుకు కావల్సినన్ని ఎరువులు, విత్తనాలు సరఫరా చేయించాలి. లేకుంటే రైతుకు కోపం వచ్చి కర్రు, నాగలి పక్కన బెడితే తినిడానికి నాలుగు గింజలు దొరక్క అందరూ ఆకలితో అలమటించిపోతారు. తస్మాత్ జాగ్రత్త. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: