హైదరాబాద్: సినీ నటుడు బాలక్రిష్ణ ఇక క్రీయాశీలక రాజకీయాల్లోకి రానున్నాడు. ఇక ఆయన తనయుడు మోక్ష సినీమాల్లో నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలక్రిష్ణనే వెల్లడించారు. మరో మూడేళ్లలో తన కుమారుడు సినీమాల్లో నటించనున్నట్లు ప్రకటించారు. బాలక్రిష్ణ ప్రకటనతో నందమూరి వంశంలో మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట. బాలక్రిష్ణ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఆనందానికి అవధుల్లు లేకుండా పోయాయి. కొడుకును తన వారసునిగా సినీమాల్లోకి తీసుకువచ్చి బాలక్రిష్ణ ఇక మీదట తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తగిన విధంగా బాలక్రిష్ణ పక్కా స్కెచ్ వేసుకుంటున్నట్టు సమాచారం. త న తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పగ్గాలు ప్రస్తుతం బాలక్రిష్ణ వియ్యంకుడైన నారా చంద్రబాబునాయుడు చేతుల్లో ఉన్నాయి. గత పదేళ్లుగా టీడీపీ అధికారానికి దూరంగా వుంది.
టీడీపీకి అనేక వర్గాలు దూరమై పార్టీ పరిస్థితి కడుదయనీయంగా మారింది. 2014నాటికి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, తెలంగాణపై లేఖ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలను తనవైపు ఆకట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. బావకు తోడుగా బాలక్రిష్ణ కూడా తనవంతు సహాయసహకారాల్ని అందిస్తున్నాడు. పార్టీకి దూరమైన వారిని తిరిగి పార్టీలోకి రప్పించడానికి శ్రమిస్తున్నాడు. బావకు దూరమైన తన సోదరుడు హరిక్రిష్ణను, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులందర్నీ ఒకతాటిపైకి తెచ్చే మరో బాధ్యతను కూడా బాలయ్య తన భుజస్కందాల మీద వేసుకున్న్టట్లు తెలుస్తోంది.
తన కుమారుణ్ణి సినీమాల్లో తన వారసునిగా తీసుకువచ్చి బాలక్రిష్ణ మాత్రం రాజకీయ రంగంలో ప్రత్యక్షంగా ఉండేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే గుడివాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడాలి నాని పార్టీని వీడారు. గుడివాడలో పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. పార్టీలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడానికి బాలక్రిష్ణ తనవంతుగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీని గాడిలో పెట్టేందుకు బాలక్రిష్ణ రంగంలోకి దిగారు. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్ రావును పార్టీలోకి రప్పించేందుకు బాలక్రిష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
2014నాటికి పార్టీకి దూరమైన వారందర్నీ పార్టీలోకి తెచ్చేందుకు బాలక్రిష్ణ తనదైనశైలిలో పావులు కదుపుతున్నారు. అయితే, బాలక్రిష్ణ రాజీకయ రంగ ప్రవేశం, కుమారుడు సినీ రంగ ప్రవేశంతో పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నందమూరి వంశంతోనే తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కలుగుతుందనీ వారంటున్నారు. వారి ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయో చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: