మీకు తెలుసా..! వెంకయ్యను సాగనంపింది తెలుగువాళ్లే..!!

Vasishta

వినటానికి కొన్ని అంశాలు చాలా విచిత్రంగా ఉంటాయి... నమ్మశక్యంగా అనిపించవు. కానీ జరిగిన పరిణామ క్రమాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అందులో వాస్తవం లేకపోలేదు అనిపించడం ఖాయం. అలాంటిదే వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి. వెంకయ్యకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆయన్ను బలవంతంగా వైస్ ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుబెడుతోంది బీజేపీ అధిష్టానం. వాస్తవానికి రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్.. వెంకయ్య కంటే జూనియర్. కోవింద్ కంటే సీనియర్ అయిన తాను ఉపరాష్ట్రపతి సీటులో కూర్చోవాల్సి రావడం వెంకయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం తనకు లేదని మొత్తుకుంటున్నా మోదీ – అమిత్ షా ఎందుకు పట్టించుకోలేదు.


ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.. బీజేపీలో వెంకయ్య కీలక నేత. అనేక సందర్భాల్లో పార్టీని సంక్షోభాల నుంచి బయటపడేసిన నేత. అలాంటి నేతను పార్టీకి దూరం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం తెలుగు వాళ్లే అంటే నమ్మి తీరాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్ప మరే ఇతర పార్టీలూ మనుగడ సాధించలేని రోజుల్లో కూడా వెంకయ్య బీజేపీతోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు బీజేపీకి ఆయన అవసరం తీరిపోయింది. వెంకయ్య ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడదనే సంకేతాలను సాటి తెలుగువాళ్లే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.


ముఖ్యంగా మోదీకి అత్యంత సన్నిహితుడైన రాంమాధవ్ ఇందులో కీలక పాత్ర పోషించారు. రాంమాధవ్ ఆంధ్రా వ్యక్తే. టీడీపీతో పొత్తు ఏమాత్రం ఇష్టంలేని సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ తదితరులు కూడా బీజేపీ అధిష్టానానికి వెంకయ్యపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు – వెంకయ్య దోస్తీ పార్టీని సర్వనాశనం చేస్తోందని, వారిద్దరూ ఇలా ఉన్నంతవరకూ పార్టీ బలపడే ప్రసక్తే లేదని వీరంతా తెగేసి చెప్పారు. ఇటీవల అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఈ ఫిర్యాదులు మరింత తారస్థాయికి వెళ్లాయి. విజయవాడలో జరిగిన అమిత్ షా బహిరంగసభలో కొంతమంది టీడీపీతో దోస్తీ వద్దంటూ నినాదాలు చేశారు. పార్టీ బలపడాలంటే వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలని ఆయన వ్యతిరేకులంతా ముక్తకంఠంతో నినదించారు.


వెంకయ్యను సాగనంపినవాళ్లలో బీజేపీకి చెందినవాళ్లే కాదు.. తెలుగుదేశం నేతలూ ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి సుజనా చౌదరి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాలను కేంద్రంలో చక్కదిద్దడంలో వెంకయ్య తర్వాత కీలక పాత్ర పోషిస్తున్నది సుజనా చౌదరే.! రాష్ట్ర ప్రయోజనాల ముసుగులో వ్యక్తిగత వ్యవహారాలకే సుజనా చౌదరి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు కొత్త కాదు.  ఇప్పుడు వెంకయ్యను క్రియాశీలక పాత్ర నుంచి తప్పిస్తే తన లాబీయింగ్ మరింత పెరుగుతుందనేది సుజనా చౌదరి ఆశ.


తిలాపాపం తలా పిడికెడు.. అన్నట్టు వెంకయ్యను క్రియాశీలక రాజకీయాల నుంచి సాగనంపడంలో తెలుగువాళ్లదే కీలకపాత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేతల మధ్య అనైక్యతను సొమ్ము చేసుకునేందుకు అధిష్టానం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లడం వల్ల అల్టిమేట్ గా నష్టపోయేది ఆంధ్రప్రదేశే.! రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇంతకుముందు లాగా ఇప్పుడు లాబీయింగ్ చేసే నేత ఎవరూ ఉండరు. కేంద్రానికి కూడా ఇదే కావాలి మరి..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: