హైదరాబాద్: రాష్ర్టంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం నడుస్తుందా? గవర్నర్ పాలన నడుస్తుందా? అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యలు, తీరు చూస్తే మాత్రం రాష్ర్టంలో గవర్నర్ పాలన నడవకున్నా, ఆయన కనుసైగల్లోనే నడుస్తుందనేది స్పష్టం. పేద విద్యార్థుల ఫీజుల వ్యవహారంపై రాష్ర్ట సర్కార్ ఓ కొలిక్కి రాలేదు. ఫీజులపై వేసిన మంత్రి వర్గ ఉప సంఘాలు, సీఎం, డిప్యూటీ సీఎం తెగ కసరత్తులు చేస్తున్నారు. డైయిలీ సీరియల్స్ మాదిరిగా సాగిస్తూనే ఉన్నారు. ఈ ఫీజులపై కిరణ్ సర్కార్ స్వపక్షం, ప్రతిపక్షం నుంచి ఎదుర్కొంటున్న తలనొప్పి ఇంతా ఇంతా కాదు. ఫీజుల విషయాన్ని ఏం చేద్దామంటూ కిరణ్ సర్కార్ హైదరాబాద్ లో తర్జనభర్జనలు పడుతుంటే...ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ర్ట గవర్నర్ నరసింహన్ మాత్రం ఫీజుల వ్యవహారాన్ని ఎంతో తేలిగ్గా తీసుకున్నారు.
ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్ మెంటు సహాయం అందుతుందున్నారు. దీంట్లో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కిందా మీదా పడుతుంటే గవర్నర్ మాత్రం విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఫీజులపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించారు. ఓ క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్యప్రమాణాల కోసం తనిఖీలు చేయడంలో తప్పేమీ లేదన్నారు. ఫీజులపై ఎవరూ అనుమానాలు పెట్టుకోవద్దనీ చెబుతూనే...గ్యాస్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రానికి లేఖలు రాయడం...పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి మరో విధంగా స్పందించడం...దీనిని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. గ్యాస్ పై కూడా గవర్నర్ స్పందించారు. గ్యాసే లేనప్పుడు కేటాయింపులు ఎలా సాధ్యమనీ ప్రశ్నించారు.
రాష్ర్టంలో బర్నింగ్ ఇష్యూ గా మారిన ఫీజు రీయింబర్స్ మెంటు, గ్యాస్ కేటాయింపులపై గవర్నర్ మాట్లాడిన తీరును చూస్తే...రాష్ర్టంలో గవర్నర్ పాలన కొనసాగుతుందా? అనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. గవర్నర్ గా నరసింహన్ అయినప్పటి నుంచి తరుచూ ఢిల్లీ వెళ్లడం...ఇక్కడి రాజకీయ పరిస్థితులను కేంద్రంలోని హెం శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి, సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్‌కు, పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్‌కు చేరవేస్తున్నాడు. అప్పడప్పుడు మాత్రం రాష్ర్టపతికి, ప్రధానికి, సోనియాకు కూడా నివేదికలిస్తుంటాడు. తరుచూ ఢిల్లీ వెళ్లే గవర్నర్ ఎవర్నీ కలిసిన అంత ప్రాధాన్యత లేదనీ, మర్యాద పూర్వకంగానే కలిసేందుకు వచ్చాననీ చెబుతుంటాడు. కానీ, చేసే పని వేరే విధంగా ఉంటుందనీ తెలంగాణవాదులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు.
తాజాగా శనివారం నాడు ఢిల్లీలో కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే తదితరులను కలిశారు. చెప్పేదేమీ లేదంటూనే రాష్ర్టంలో పెద్ద సమస్యగా మారిన ఫీజుల విషయం, గ్యాస్ కేటాయింపుపై క్లార్టీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా రాష్ర్టంలో ఉన్నది కిరణ్ సర్కారేననీ అనడం కొసమెరుపు. ఇది చూసిన వారికెవరికైనా రాష్ర్టంలో గవర్నర్ పాలన సాగుతుందనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రాష్ర్ట పాలనలో గవర్నర్ జోక్యం పెరిగిపోయిందనే దానికి ఫీజులపై,గ్యాస్ కేటాయింపులపై గవర్నర్ వివరించడమే నిదర్శనమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫీజుల భారంపై రాష్ర కేబినెట్ మల్లగుల్లలు పడుతుంటే దానిని ఈజీగా గవర్నర్ ముగింపు పలికారు. ఇప్పటి వరకు సాధ్యం కాదన్న వారు గవర్నర్ వివరణతో ఏం చెబుతారో చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: