ధరలో ధగా -: రైతును ఆదుకునే వారే లేరా

Kuthuru RajiReddy
మొక్కజొన్న తలసుంచుకు వచ్చింది, వరిచేను కలుపుకువచ్చింది, ఎరువులు వేసే సమయం అయిపోవస్తుంది. అయిన రైతుకు యూరియా మార్కెట్ లో దొరుకడం లేదు. 281 రూపాయలకు విక్రయించాల్సిన యూరియా బ్యాగును 300రూపాయలకు డీలర్లు బహిరంగంగా విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతుంది. యూరియా బ్యాగును నిర్ణయించిన ధరలకే విక్రయించాలనే నిబంధన ఎవరు పాటించడం లేదు. ఫలితంగా యూరియా విక్రయించే వారు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. 19 రూపాయల వరకు బ్యాగుకు పెంచి విక్రయిస్తున్నప్పటికిని ఇదేమిటని ప్రశ్నించేవారు కరువయ్యారు. రైతుల అమాయకత్వం ఆసరగా చేసుకొని యూరియా కొరత పేరిట దుకాణా దారులు ధరను పెంచి విక్రయిస్తున్నారు. యూరియా కొరతతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులు యూరియా సంచి దొరికతే చాలుననుకొని ధర గూర్చి అడుగడంలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు సైతం తెల్సునని విక్రయించే వారు, క్రింది స్థాయి అధికారులు చెబుతున్నారంటే ఈ వ్యవహారం బహిర్గతంగానే నడుస్తుందని అనుకోవచ్చు. యూరియా తెప్పించేందుకు డిడిలు కట్టడం కోసం డీలర్లు ముందుకు రావడం లేదని, వారు డబ్బులు చెల్లించిన తర్వాత 20రోజుల వరకు యూరియా డీలర్లకు చేరుతుందని ఫలితంగా డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని అందుకే ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని డీలర్లకు మద్దతుగా సంబంధిత క్రింది స్థాయి అధికారులు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో రైతులను మోసం చేస్తున్నారో స్పష్టమవుతుంది. దేశానికి వెన్నుముక రైతేనంటూ ప్రసంగాలు చేసే నాయకులు, ప్రభుత్వం రైతుల సమస్యల గూర్చి పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు అడుగడున మోసపోతున్నారు. రైతులకు ఐక్యతలేకపోవడం, వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో రైతులు వారి సమస్యల కోసం పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. రైతు సంఘాల నాయకులమని చెప్పుకుంటున్న వారు, ప్రకటనలు మినహాయించి ఆచరణలో ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాని ఎమ్మెల్యేలు, నాయకులు ఉంటే రైతులకు న్యాయం జరిగేదెలా అనే సందేహాలు కలుగుతున్నాయి. మొక్కల పెంపుదల కోసం ఎక్కువగా ఉపయోగ పడే కాంప్లెక్స్ బ్యాగ్ ధర 12వందల రూపాయలు ఉండడంతో యూరియా వినియోగం ఎక్కువగా ఉంది. కాగా రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయకపోవడం, ఎక్కువ ధరలకు విక్రయించడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నింటిలో ధగా పడుతున్నటువంటి రైతులు సహనం కోల్పోయి కన్నెర్ర చేయకముందే రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరముంది. లేనట్లైయితే గతంలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి అధికారం కోల్పోయిన పార్టీల జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేరడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: