సర్కార్ విద్యపై ఎందుకింత నిర్లక్యం !! కారణం ఎవరది ?

Kuthuru RajiReddy
సర్కార్ చదువు బలహీన పడుతుంది, పిల్లలను సర్కార్ స్కూళ్లలో చదివించాలంటే తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. 20సంవత్సరాల క్రితం విద్యార్థులతో కిటకిటలాడిన ప్రభుత్వపాఠశాలలు విధ్యార్థులు లేక దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు లెక్కకు మించి పుట్టుక రావడంతో పాటు మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. పేద, మద్యతరగతి ప్రజలు వారి పిల్లలను ఫీజులను భరిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నది వారికి డబ్బులు ఉండి కాదు. అప్పులు చేసి తమ పిల్లలు భవిష్యత్తులో రాణిస్తారనే ఆశతో పంపిస్తున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో నిర్వహణ, ఉపాద్యాయుల పనితీరుతో విసిగి పోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయుల కొరత, సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు తగ్గిపోతున్నారని ప్రచారం ఉండేది. అయితే సరిపడసౌకర్యాలు, సరిపడ సిబ్బంది ఉన్నప్పటికిని విధ్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో అనే విషయాలపై అనేక విమర్శలున్నాయి. విమర్శలనుకుంటున్నాము కాని ఆచరణలో చూస్తే వాస్తవమే అనిపిస్తుంది. కొంతమంది ఉపాధ్యాయలు బాధ్యతలను విస్మరించడం, ఉద్యోగానికి డోకాలేదనో దీమాతో పాఠశాలలకు వేళపాళ లేకుండా వెళ్లడం, అసలు వెళ్లక పోవడం, ఇలా జరుగుతున్నప్పటికిని సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రభుత్వ విద్యపై అసక్తి సన్నగిల్లుతుంది. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటునటువంటి పరిస్థితిలో ప్రభుత్వ ఉపాద్యాయలు కొందరు బడులకు ఎగనామం పెట్టి వచ్చే జీతం చాలదనుకొని రియల్ ఎస్టేట్, చిట్టీలు నడుపడం, పైనాన్స్ లు నిర్వహించడంతో కాలం వెళ్ల దీస్తున్నారు. మరికొంత మంది నాయకులుగా, ఏదో సంఘానికి పెద్దమనుషులుగా, ఇంకొందరు ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధకులుగా, మరికొంత మంది మరో రకంగా పాఠశాలల పనివేళల్లో, పనిదినాల్లో ఎమ్మేల్యేల ముందు, ఉన్నతాధికారుల ముందు ప్రజాప్రతినిధులను మరిపించే విధంగా దర్శనమిస్తుంటే ఇంతకన్న నిదర్శనం ఏముందో సంబంధిత ఉన్నతాధికారులకే తెలియాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరు ఇలాగే ఉంటే అతి త్వరలో ప్రభుత్వ విద్యారంగం మరింత అధ్వాన్నంగా మారుతుంది. ఇంతే కాదు కోట్లాది రూపాయలు వెచ్చించి నెలకొల్పిన పాఠశాలలు మూతపడిన ఆశ్చర్యం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వపాఠశాలల పనితీరుపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టిసారిస్తే పాఠశాలల పరిస్థితి మెరుగుపడే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: