హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం అవలంభిస్తున్నట్లు వస్తున్న విమర్శలు నిజమేనన్నట్లుగా తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని కారణంగా తెలంగాణలో ఆ పార్టీ బొక్కాబోర్లాపడ్డది. రోజు రోజుకూ ఆ పార్టీ బలహీనపడుతోంది. దీనితో తెలంగాణపై మరోమారు స్పష్టమైన లేఖను కేంద్రానికి ఇప్పించేందుకు తెలంగాణ తమ్ముళ్లు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక రేపో,మాపో తెలంగాణకు అనుకూలంగా లేఖను ఇవ్వడానికి టీడీపీ అధినేత బాబు సమాయత్తమవుతున్నట్లు మీడియాకు లీక్ లు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు.
రాష్ర్టాన్ని ఉంచితే ఒకటిగా ఉంచాలీ, లేకుంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణగా మూడు రాష్ర్టాలుగా విభజించాలంటూ కొత్త ప్రతివాదనలను తెరపైకి తెచ్చాడు. తెలంగాణపై టీడీపీ లేఖ ఇస్తుందనీ ప్రచారం జరుగుతున్న క్రమంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ర్టాన్ని విభజిస్తే రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామనీ, తాము సర్కార్ జిల్లాల వారికి ఊడిగం చేయమనీ, తమ సత్తా ఏమిటో చూపిస్తామంటున్నాడు. ఉన్నఫలంగా బైరెడ్డి తెర ముందుకు రావడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, తెలంగావాదులంతా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి పేరిట తెరపై ఆడుతున్నది బైరెడ్డే అయినప్పటికీ ఆయనను ఆడిస్తున్నది బాబే అనే విషయం రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికి వేరే చెప్పనక్కర్లేదు.
2009డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తుందనగానే సీమాంధ్రలోని టీడీపీ నేతల్ని చంద్రబాబు ఉసిగొల్పాడనీ, ఇప్పుడు ఓ వైపు తెలంగాణకు అనుకూలమనీ లేఖ ఇస్తామనీ తెలంగాణ తమ్ముళ్లకు చెబుతూనే మరోవైపు రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఉసిగొల్పుతున్నాడనేది కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అనంతపురానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు మరోమారు తెలంగాణ వస్తుందనీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నాడనీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదనీ చెబుతున్న చంద్రబాబు రాయలసీమ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలంటూ ఆయన పార్టీకి చెందిన బైరెడ్డి మాట్లాడుతుంటే మౌనంగా ఉండటంతోనే బైరెడ్డి వెనక ఎవరున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందన్నప్పుడు పార్టీకి చెందిన ఇతర ప్రాంత నేలు ధిక్కారస్వరం ఆలపిస్తుంటే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా బాబుపైనే ఉంటుందనీ వేరే చెప్పనవసరం లేదు.
ఈ రెండు పడవల ప్రయాణమే టీడీపీని అక్కడ-ఇక్కడ కోలుకోలేని విధంగా చేసింది. అయినప్పటికీ బాబు రెండు పడవల ప్రయాణమే చేస్తున్నాడు. ఇటు తెలంగాణ, అటు సమైక్యాంధ్ర నాటకాన్ని ఆడిపించడం టీడీపీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం చేకూర్చదనీ రాజకీయ ఉద్దండుడైన బాబుకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, బాబు 2014వరకు ఈ ఆటను ఇలాగే ఆడిస్తాడా? లేక మధ్యలో ఏమైనా ఈ సమస్యకు తెరదిస్తాడా? అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. చూద్దాం మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: