అండగా ఉండేందుకే వచ్చా: విజయమ్మ

 హైదరాబాద్: నేతన్న సమస్యలపై సర్కార్ పై సమరశంఖం పూరించడానికి సిరిసిల్లలో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షను చేపట్టారు. ఆమె హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయలుదేరింది మొదలుకుని సిరిసిల్లలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం చేరే వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు దారిపోడవున అడ్డుపడ్డారు. విజయమ్మ కాన్వాయ్ పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఎవరెన్ని విధాలుగా ఆటంకాలు స్రుష్టించినా వాటన్నింటిని దాటుకుని దీక్షాస్థలికి చేరుకుని దీక్ష చేపట్టారు. ఓ వైపు టీఆర్ఎస్ క్యాడర్ నిరసనలు...మరో వైపు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, చేనేత కార్మికుల కుటుంబాలు, మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల విజయమ్మను ఆప్యాయంగా ఆహ్వానించింది.  తమ సమస్యలపై పోరాడటానికి వచ్చిన విజయమ్మను నేతన్న కుటుంబాలు అక్కున చేర్చున్నాయి. ఆదరించాయి. వేలాది మంది కార్యకర్తలు, కార్మికులు తరలి రావడంతో దీక్షా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ప్రాంగణం వద్ద కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత రభస చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యన విజయమ్మ ప్రసంగం కొనసాగింది. చేనేత రంగానికి ప్రభుత్వాల చేయూత కరువైందన్నారు. గిట్టుబాటు ధరలు లేకనే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావన్నారు. బతికి ఉండి సాధించుకోవాలే తప్ప సచ్చి సాధించిదేమీ ఉండదన్నారు.  మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చాననీ, మీ తరుపున ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మీరు మాత్రం అధైర్యపడొద్దంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులు, నేతన్నల కష్టాలను తీర్చేందుకు ఎంతో కష్టపడ్డాడనీ గుర్తు చేశారు. దేశంలో వ్యవసాయరంగం తరువాత ఎక్కువ మంది ఆధారపడ్డ పరిశ్రమ చేనేత పరిశ్రమన్నారు. ఇప్పుడు వారి గురించి పట్టించుకునే వారే లేరన్నారు. రైతులన్నా, చేనేత కార్మికులన్నా ప్రస్తుత ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు.  త్వరలోనే జగన్మోహన్ రెడ్డి పాలన వస్తదనీ, అప్పుడు రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరుస్తాడన్నీ ఆమె హామీ ఇచ్చారు. విజయమ్మ ప్రసంగమంతా చేనేత కార్మికులకు తాము అండగా ఉన్నామనీ, వారికి భరోసా ఇచ్చే విధంగా సాగింది. విజయమ్మ ప్రసంగం వచ్చిన వారందర్నీ ఆకట్టుకుంది. విజయమ్మ వెంట దీక్షలో మాజీ మంత్రి కొండా సురేఖ కూర్చోగా పార్టకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అనుకున్నట్లుగానే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేసి ఆ పార్టీ నాయకులు పంతాన్ని నెగ్గించుకున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ ఇలాకలో విజయమ్మ టూర్ సక్సెస్ అయ్యిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: