బండి భగీరథ్ కు బెయిల్ నిరాకరణ.. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా?

Reddy P Rajasekhar

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి చుక్కెదురైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై పేట్‌బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన పోక్సో (POCSO) కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అరెస్ట్ నుంచి తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని, లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాది గట్టిగా విజ్ఞప్తి చేసినప్పటికీ, ఈ దశలో ఎలాంటి ఉపశమనం లేదా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అర్ధరాత్రి వరకు సాగిన ఈ విచారణ అనంతరం జస్టిస్ టి. మాధవీదేవి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మే 21న తుది తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు ప్రకటించింది. తక్షణ రక్షణ లభించకపోవడంతో బండి భగీరథ్‌కు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. బాధిత బాలిక మైనర్ కాదని, ఆమె వయసుపై అనుమానాలు ఉన్నాయని భగీరథ్ తరఫు న్యాయవాది వాదించినప్పటికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు బలమైన ఆధారాలను కోర్టు ముందుంచారు. బాధితురాలి పదో తరగతి సర్టిఫికెట్, పుట్టిన తేదీ పత్రాలను సమర్పిస్తూ ప్రస్తుతం ఆమె వయసు 17 సంవత్సరాల 3 నెలలని, ఆమె ముమ్మాటికీ మైనరేనని నిరూపించారు. అంతేకాకుండా మొదట సాధారణ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసును, బాధితురాలి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరింత కఠినమైన పోక్సో సెక్షన్లు 5(l) మరియు 6 కిందకు మార్చినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఇలాంటి సున్నితమైన మరియు తీవ్రమైన కేసుల్లో ముందస్తు బెయిల్ కానీ, అరెస్ట్ నుంచి రక్షణ కానీ ఇవ్వడం సరికాదని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చట్టపరమైన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ చుట్టాలు కారని, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా భగీరథ్ విచారణకు హాజరుకాకుండా మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఆయన కోసం ఢిల్లీ, కరీంనగర్ వంటి ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించడం, పోలీసులు ఇప్పటికే ఆయన కోసం గాలిస్తుండటంతో, మే 21న కోర్టు తీర్పు రాకముందే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే చాన్స్ ఉందనే ప్రచారం జోరందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: