“సెన్స్ ఉందా మీకు?” జనసేన నేతలపై నాగబాబు ఫైర్ వైరల్!
పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వైద్యుల సలహా మేరకు ఆయనకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు.. “పవన్ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. మరో ఐదు నుంచి ఏడు రోజుల్లో ఆయన మళ్ళీ విధుల్లో చేరుతారు” అని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికే పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
పిఠాపురం నియోజకవర్గ నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో నాగబాబు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. స్థానిక నాయకులు నియోజకవర్గ సమస్యలు, కమిటీల పనితీరు, పదవుల గురించి నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ విషయాలు, కాంట్రవర్సీల గురించి మాట్లాడుతున్న నేతలను చూసి నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.“నేను ఇక్కడికి వివాదాల గురించి మాట్లాడటానికి రాలేదు. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా.. మీ నియోజకవర్గం కోసం ఇంత కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కడైనా అడిగారా? మీకు అసలు సెన్స్ ఉందా? ఆయన ఆరోగ్యం గురించి మీకు పట్టదా?” అంటూ నేతలను కడిగిపారేశారు.
నాగబాబు ఆగ్రహంతో ఒక్కసారిగా సమావేశంలో నిశ్శబ్దం ఆవరించింది. పవన్ కళ్యాణ్ పై నాగబాబుకు ఉన్న ప్రేమాభిమానాలను చూసి స్థానిక నేతలు అవాక్కయ్యారు. తమ తప్పు తెలుసుకున్న నాయకులు వెంటనే నాగబాబుకు క్షమాపణలు చెప్పారు. పవన్ కోలుకోవాలని కోరుకుంటున్నామని, విధుల్లో చేరడం కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామని తెలిపారు.రాజకీయాల పక్కన పెడితే, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని నాగబాబు గుర్తు చేశారు. గత రెండేళ్లలో దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశామని, ఎన్నికల హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. పవన్ పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత సమయం పడుతుందని, అయితే వారం రోజుల్లో ఆయన అధికారిక పనుల్లో నిమగ్నమవుతారని రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కూడా ధృవీకరించారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, మళ్ళీ అసెంబ్లీలో గర్జించాలని అటు సినిమా అభిమానులు, ఇటు రాజకీయ అనుచరులు ఆకాంక్షిస్తున్నారు. నాగబాబు ఇచ్చిన ఈ అప్‌డేట్ తో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేయబోయే తదుపరి అభివృద్ధి పనుల కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.