Tamil Nadu: అజిత్ వ్యాఖ్యలంటూ వైరల్ అసలు నిజం ఏంటి?
గత కొన్ని రోజులుగా అజిత్ బెల్జియంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్ రేసింగ్ పోటీల్లో తన టీమ్‌తో కలిసి పాల్గొన్నారు. అక్కడ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి, ఏకంగా రెండవ బహుమతిని (Silver Medal) గెలుచుకుని దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటారు. ఈ భారీ విజయం తర్వాత బుధవారం (ఏప్రిల్ 22) రాత్రి చెన్నై చేరుకున్న అజిత్, విశ్రాంతి కూడా తీసుకోకుండా ఈరోజు ఉదయాన్నే ఓటు వేయడానికి సిద్ధమయ్యారు.ఉదయం 7 గంటలు కాకముందే తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి అజిత్ చేరుకున్నారు. తెల్లటి కోట్ సూట్, సన్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా వచ్చిన ‘తల’ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. అందరికంటే ముందుగా ఓటు వేసిన మొదటి స్టార్‌గా అజిత్ నిలిచారు. ఓటు వేసిన అనంతరం తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ చిరునవ్వుతో పలకరించి, హుందాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అజిత్ ఓటు వేసి వెళ్తున్న సమయంలో విలేకరులు ఆయనను పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. కానీ, కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. “ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారా?” అని విలేకరులు అడగ్గా, అజిత్ “వద్దు” అని సమాధానం ఇచ్చారని నెట్టింట ప్రచారం మొదలైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వెంటనే రంగంలోకి దిగారు."అజిత్ గారు విలేకరులతో అసలు మాట్లాడలేదు. ఆయన పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అదంతా తప్పుడు సమాచారం" అని సురేష్ చంద్ర క్లారిటీ ఇవ్వడంతో వివాదానికి తెరపడింది.
సినిమా షూటింగ్‌లు, అంతర్జాతీయ రేసింగ్ పోటీల ఒత్తిడిలోనూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరుసటి రోజే వచ్చి ఓటు వేయడం అజిత్ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే అజిత్, ఈసారి కూడా తన సైలెంట్ పవర్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ విజయం మరియు ఆయన ఓటింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.