బీసీవై పార్టీ బీసీ మ‌హాగ‌ర్జ‌న‌కు ముహూర్తం ఫిక్స్‌... డేట్ ఇదే... !

RAMAKRISHNA S.S.
- బిసిలకు రక్షణ చట్టం, రాజధానిలో బిసిలకు వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లను కేటాయించాలి
- విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లోనూ 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
- ఎపిలో అధికారంలో ఉండేది కూటమి కాదు.. చంద్రబాబు నాయుడు అండ్ సన్ కంపెనీ
- రాజధానిలో బిసి పారిశ్రామిక వేత్తలకు కూడా ఎకరా 99 పైసలకు కేటాయించాలి
- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్
- ఒకే వేదిక పైకి వచ్చిన అన్ని బిసి సామాజిక వర్గాలు
- విజయవాడలో బిసివై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎపి బిసి మహా సదస్సు సూపర్ సక్సెస్
- బిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్


రాష్ట్రంలో బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులపై విస్తృత చర్చ జరిపే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఏపీ బీసీ మహా సదస్సు - చర్చ కార్యక్రమం విజయవంతమైంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు బీసీ సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని, బీసీల అభ్యున్నతికి సంబంధించిన పలు కీలక అంశాలపై తమ అమూల్యమైన సూచనలు అందించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు ఏకబిగిన జరగడం విశేషం. ఈ సదస్సును ఉద్దేశించి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వాల వైఫల్యాలను ఆయన ఎత్తిచూపారు.


రాజధానిపై రెండు పార్టీల రియల్ ఎస్టేట్ వ్యాపారం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు కేవలం రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం నడుపుతున్న రెండు ప్రైవేట్ కంపెనీలుగా పరిగణిస్తున్నాయని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు, అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా భావించి, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 33 వేల ఎకరాలు సేకరించి, రైతులకు కేవలం ఒక పత్రం ఇచ్చి ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు వైఖరిని అలుసుగా తీసుకున్న జగన్, మూడు రాజధానులనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి, చివరికి రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథగా మిగిల్చారని విమర్శించారు.


కూటమి ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయాదవ్
ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీడీపీ, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పునఃప్రారంభించిందని, రాజధాని రైతులను మోసం చేసే పనులు చేస్తోందని అన్నారు. 33 వేల ఎకరాలు పంచాయితీకి కూడా సరిపోవని ఎద్దేవా చేసిన చంద్రబాబు, గెజిట్ ఆమోదముద్ర వేయించుకోలేకపోతున్నారని, దీని వెనుక ఆయన చిత్తశుద్ధి లోపించిందని స్పష్టమవుతోందని అన్నారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు కడతామని కుంటిసాకులు చెబుతూ, ఆ భూములను ఆయన జేబు కంపెనీలకు, తమ బంధువులకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాజధానిలో బీసీలకు వెయ్యి ఎకరాల వాటా
రాజధాని అంటే పరిపాలనకు సంబంధించిన నిర్మాణాలు కావాలని, కేవలం వ్యాపార కేంద్రం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజధాని నిర్మాణంలో దక్కాల్సిన వాటాపై చర్చించడానికే ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన మోసం, అమరావతిలో పునరావృతం కానివ్వబోమని హెచ్చరించారు. బీసీ యువ పారిశ్రామికవేత్తల కోసం రాజధానిలో తక్షణమే మరో వెయ్యి ఎకరాలు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయికి ఎకరం చొప్పున తమ కుటుంబ సభ్యులకు, జేబు సంస్థలకు ఇచ్చినట్లే... బీసీలకు కేటాయించే ఆ వెయ్యి ఎకరాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరను చెల్లించడానికి ఒక బీసీ బిడ్డగా తాను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు.


బీసీ రక్షణ చట్టంపై రెండు పార్టీల మౌనం
ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలపై దాడులు జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ కల్పించే 'బీసీ రక్షణ చట్టం' తేవాలని 2023 జూలై లో జరిగిన బీసీవై పార్టీ ఆవిర్భావ సభలోనే తాను డిమాండ్ చేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత మూడు నెలలకు నారా లోకేష్ తమ డిమాండ్‌ను కాపీ కొట్టి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చట్టం గురించి మాట్లాడకపోవడం దారుణమన్నారు. బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడకుండా టీడీపీ, వైసీపీలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.


44% రిజర్వేషన్లతో పాటు సమగ్ర కులగణన నిర్వహించాలి
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తున్నాయని, కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి, దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం, మురళీధరన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.


బీసీల ఆత్మగౌరవంపై హెచ్చరిక
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి బీసీ అధికారులను 'వాడూ, వీడూ' అని కించపరిచేలా మాట్లాడితే, వైసిపిలో ఉన్న బీసీ నేతలు ఖండించకపోగా ఆయనను పొగడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు గానీ, జగన్ గానీ, మరెవరైనా గానీ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శాఖను కూడా నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారనడం, బీసీ నేతలను ఎలా అణచివేస్తున్నారో చెప్పడానికి నిదర్శనమన్నారు.


2026 ఫిబ్రవరి 22న బిసి గర్జన... భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రామచంద్రయాదవ్
టిడిపి, వైసిపి దోపిడీ పార్టీలనే గ్రహణాలు వీడకపోతే బీసీలకు న్యాయం జరగదని, బీపీ మండల్, మురళీధరన్ కమిషన్ సిఫార్సుల మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్త ఉద్యమానికి బీసీవై పార్టీ శ్రీకారం చుడుతుందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఇందులో భాగంగా, 2026 ఫిబ్రవరి 22న దేశవ్యాప్త బీసీ ప్రముఖులతో, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున "బీసీ గర్జన" బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: