“జూబ్లీహిల్స్ ఫలితంతో సీఎం రేవంత్ దూకుడు – కేబినెట్‌లో పెద్ద మార్పులు?”
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో రేవంత్ అమలు చేసిన పథకాలు, నిర్ణయాలు ప్రజల్లో ఆశించినంత ప్రభావం చూపకపోవడంతో, అందుకు ప్రధాన కారణం – మంత్రుల నిర్లక్ష్యం అని సీఎం సర్కిల్‌లో భావన ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో మంత్రులు పూర్తిగా పాసివ్‌గా ఉన్నారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ "రీవ్యూ ద్వారా రీషఫుల్” చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అమలు చేసే ముందు రేవంత్ ఒక అంశాన్ని స్పష్టంగా గమనిస్తున్నాడు - అదే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం. ఈ ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే, రేవంత్ తన అధికారాన్ని మరింత బలపరుచుకునే అవకాశముంది. అది జరిగితేనే, కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తి స్థాయిలో జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వర్గాల సమాచారం ప్రకారం, కనీసం ఐదుగురు మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పాత మంత్రులలో కొందరిని తప్పించి, కొత్త, యాక్టివ్ ఫేస్‌లకు అవకాశం ఇవ్వాలని సీఎం ఆలోచన. ఈ క్రమంలో పార్టీకి కట్టుబడి పనిచేసిన కొంతమంది ఎమ్మెల్యేలుకి మంత్రి బర్తులు దక్కే అవకాశం ఉందని టాక్. ఇకపోతే, ఈ మార్పులు కేవలం ప్రభుత్వ పరిమితిలోనే కాకుండా, పార్టీ ఆర్గనైజేషన్ పునర్‌వ్యవస్థీకరణకు కూడా దారితీస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా తనదైన బృందం ఏర్పరుచుకోవడమే లక్ష్యంగా కదులుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం రేవంత్ పాలనకు టర్నింగ్ పాయింట్ కానుంది. ఆ ఫలితం అనుకూలంగా వస్తే, ప్రభుత్వంలో పెద్ద మార్పులు, కేబినెట్ క్లీన్‌అప్, కొత్త శక్తుల ప్రవేశం — ఇవన్నీ సీక్వెన్స్‌లో జరగొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. "రేవంత్ స్టైల్ గవర్నెన్స్" ఇప్పుడు నిజంగా గమనించదగిన దశలోకి అడుగుపెడుతోందన్న మాట వినిపిస్తోంది.