ఏపీలో వైసీపీతో పొత్తుకు ఆ పార్టీలు రెడీనా... !

RAMAKRISHNA S.S.
ఏపీలో క‌మ్యూనిస్టు పార్టీల దృష్టి ఇప్పుడు వైసీపీపై కేంద్రీకృతమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడిగా సాగుతోంది. ముఖ్యంగా సీపీఎం ఇప్పటికే వైసీపీతో తెరచాటు బంధాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం గ‌ట్టిగా వినిపిస్తోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీపీఎం నాయకులు ప్రభుత్వంపై ఎలాంటి ఘాటు విమర్శలు చేయకపోవడం, పబ్లిక్‌గా ప్రతిపక్ష ధోరణి కనబరచకపోవడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సీఎం జగన్‌కు దూరపు బంధువు అన్న వాదన కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు జగన్ స్వయంగా ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించడం రాజకీయంగా పెద్ద దుమారంగా రేపింది. సీపీఎం పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు రావడం, జిల్లాల నుంచి మండలాల స్థాయి వరకు పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు భూములు కేటాయించబడటం వంటి పరిణామాలు ఆ అనుబంధాన్ని మరింత బలపరిచాయి. మరోవైపు, అప్పట్లో సీపీఐ మాత్రం వైసీపీ ప్రభుత్వానికి దూరంగా ఉండి, తమ స్వతంత్ర ధోరణిని కొనసాగించింది. అయితే, తాజా పరిణామాలు చూస్తే సీపీఐ కూడా మార్పు దిశగా నడుస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన గుజ్జల ఈశ్వరయ్యను ఎంపిక చేయడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జగన్ సొంత జిల్లాకు చెందిన నేతకు ఆ పదవి ఇవ్వడం వెనుక వైసీపీతో పొత్తు ప్రణాళికే ఉందన్న వాదన వినిపిస్తోంది. గతంలో కొంతవరకు వైసీపీ పాలనపై విమర్శలు చేసిన సీపీఐ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మరింత దూకుడు ప్రదర్శించడం ఈ మార్పుకు నిదర్శనం. వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కమ్యూనిస్టులు అప్రకటితంగా పాల్గొనడం, అధికారికంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైసీపీతో కలిసి పోరాడతామంటూ వ్యాఖ్యానించడం కూడా ఈ స్నేహ బంధాన్ని బలపరుస్తోంది. మొత్తానికి, “ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు ” అన్న నానుడి మరోసారి నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కమ్యూనిస్టులు - వైసీపీ పొత్తు పొడిస్తే ... అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: