జూబ్లిహిల్స్ బై పోల్‌: ఓట‌రు నాడి ఎలా ఉందంటే... !

RAMAKRISHNA S.S.
తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేని స్థితి. ప్రతి రోజు వాతావరణం మారుతున్నట్లుగా రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ప్రజల నాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సర్వే సంస్థలు కూడా ఒక్కో రోజు ఒక్కో విధంగా ఫలితాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల సానుభూతి ఫ్యాక్టర్ పనిచేస్తుంటే, మరికొన్నిచోట్ల ప్రభుత్వ పథకాల ప్రభావం చర్చనీయాంశమవుతోంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మోడీ మానియా కూడా ఓ స్థాయిలో కనపడుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలూ తమ శక్తి మేరకు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు అనే ప్రయోజనం ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం హిందూత్వ అజెండాను ముందుకు తెచ్చి మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది.


ప్రస్తుతం జూబ్లిహిల్స్ బై పోల్ ప్ర‌చారం అంతా మహిళా సెంటిమెంట్ చుట్టూ తిరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి తో వచ్చిన ఖాళీని భర్తీ చేయడానికి గోపీనాథ్‌ భార్య మాగంటి సునీత‌ బరిలోకి దిగుతుండటంతో వ‌చ్చే సానుభూతి బీఆర్ఎస్‌కు లాభపడే అవకాశముందనే రాజ‌కీయ వ‌ర్గాల అంచనా ఉంది. “ భర్త చేసిన సేవలే తనకు గెలుపు తెస్తాయి ” అనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే, ఆ సానుభూతి ఎంతవరకు ఓట్లుగా మారుతుందన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. ఇంకా 17 రోజుల ప్రచార కాలం మిగిలి ఉండటంతో లెక్కలు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. పెద్ద నాయకులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, బండి సంజయ్ లాంటి వారు — ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి రాకపోవడం వల్ల చివరి వారంలో హీటెక్కే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఓపీనియన్ పోల్స్‌లో బీఆర్ఎస్‌కు స్వల్ప ఆధిక్యం ఉందని సూచనలు వచ్చినా, తాజా సర్వేలలో ఆ ఎడ్జ్ తగ్గింది. స్థానికంగా నిర్వహించిన మరో సర్వే ప్రకారం కాంగ్రెస్ పట్టు పెరుగుతోందని తేలింది.


కాంగ్రెస్ ఈసారి గెలుపు పై పూర్తి నమ్మకంతో ఉంది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన నవీన్ యాదవ్‌ను మరోసారి బరిలోకి దింపారు. ఆయన అప్పట్లో 35 వేల ఓట్లకే పరిమితమై డిపాజిట్ కూడా కోల్పోయినా, ఈసారి తాము భారీ మెజారిటీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికలు త్రిముఖ‌ పోరుగా మారాయి. చివరి దశ ప్రచారం, స్థానిక వర్గాల మద్దతు, మహిళా సెంటిమెంట్, ప్రభుత్వం పథకాల ప్రభావం ఇవన్నీ ఫలితాలను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో ఈ పోరు చివరి రోజు వరకు సస్పెన్స్‌గా కొనసాగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: