ఏపీలో కొత్త జిల్లాలు... కాంట్రవర్సీలు తప్పవా... ?
అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పాడేరు జిల్లా కేంద్రం నుంచి రంపచోడవరం 187 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో కీలక ప్రతిపాదన ఏంటంటే అమరావతిని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలను కలిపి రాజధాని చుట్టుపక్కల ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై చర్చ కొనసాగుతోంది. అమరావతి రాష్ట్ర రాజధానిగా మారుతున్న నేపథ్యంలో, అక్కడి శాంతిభద్రతలు, ప్రొటోకాల్ విధులు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాగా ఏర్పాటు చేయడం సముచితమని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. అదేవిధంగా మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు.
అద్దంకి, మడకశిరతో సహా దాదాపు పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక నియోజకవర్గం రెండు లేదా మూడు డివిజన్లకు విభజించబడితే పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే పరిధిలోకి తీసుకురావాలన్న సూచన కూడా ఉంది. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆగస్టు 13న సచివాలయంలో మొదటి సమావేశం జరిగి, జిల్లా కలెక్టర్లు ప్రజాసంఘాలు, నాయకుల నుంచి అందిన సుమారు 200 అర్జీలను పరిశీలించారు. మూడు రోజుల క్రితం జరిగిన సమీక్షలో ఈ అర్జీలపై చర్చించి తుది ప్రతిపాదనలు ఖరారు చేశారు. అయితే ఏ మార్పులు చేసినా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకెళ్తోంది. పూర్తి వివరాలు బయటకు రాగానే రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.