జగన్ పాలనతో పోలిస్తే బాబు పాలనలో 10 రెట్లు దోపిడీ, అరాచకాలు
జగన్మోహన్‌రెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్ కి చెందిన ఇండోసోల్ కంపెనీకి రు. 37 వేల కోట్లు దోచిపెడితే.. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఏకంగా 69 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమానికి తెరలేపుతోందన్నారు. గత ఐదేళ్లలో జగన్ ఉద్యోగాల కల్పనలో విఫలమైతే.. ఈ రోజు బాబు ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు పీకేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వంలో అరాచకాలు సహించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఇక్కడా అవే జరుగుతూ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను అధికార పార్టీకి కార్యకర్తలుగా మార్చుకునే విష సంస్కృతికి బీజం వేస్తే ఈ రోజు పోలీసులను తెలుగుదేశం పార్టీలో ఒక విభాగంలా మార్చేశారన్నారు. ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా... రైతులు, మహిళల తరపున మాట్లాడితే అక్రమ కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నారంటూ బోడే మండిపడ్డారు.
కరేడులో ఇండోసోల్ కంపెనీ ప్రతినిధులు ఇళ్లకు వెళ్లి మా కంపెనీకి మీరు భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటామని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని.. శనివారం రాత్రి పోలీసులు గ్రామానికి వెళ్లి రైతులను బెదిరించగా.. డీఎస్సీ సైతం గ్రామస్తులను పిలిపించి బెదిరిస్తున్నారన్నారు. రాధేయపేటలో పోరాటం చేస్తోన్న 200 మంది మత్స్యకారులపై 307 కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీసీలకు, బహుజనులకు అధికారం రావాలన్న ఆశయంతోనే తాను బీసీవై పార్టీని స్థాపించానని రామచంద్ర యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వంలోనే నాపై 27 అక్రమ క్రిమినల్ కేసులు పెట్టారన్న విషయాన్ని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారని.. నేడు ఇదే చంద్రబాబు ఆయన ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతున్నానని ఇప్పటికే నాపై 10 అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. తిరుమల అపచారం, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకే ఈ కేసులు పెట్టారన్నారు. హైకోర్టు అనుమతితో రాధేయపేటకు వెళుతుంటే ఒకే రోజు మూడు పోలీస్‌స్టేషన్లలో మూడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఈ రోజు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు.
సోమవారం హైకోర్టు అనుమతితో రాధేయపేటకు వెళ్లే ప్రయత్నంలో ఉంటే పోలీసులు అక్కడ అధికార పార్టీ కార్యకర్తలను ప్రేరేపించి.. గొడవలు సృష్టించి వాటిని నాతో పాటు బీసీవై పార్టీపై నెట్టేసి అక్రమ కేసులు పెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారని రామచంద్ర యాదవ్ విమర్శించారు. డీజీపీ ఆఫీస్ నుంచి రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అందరికి రామచంద్ర యాదవ్‌పై ఉన్న క్రిమినల్ కేసుల లెక్కలు సేకరించాలని ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారని... పోలీసులకు రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవా ? అని ఆయన ప్రశ్నించారు. తాను ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటే.. ఈ ప్రభుత్వం నామీద రౌడీషీడ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబులా తాను పథకాలు, ఎర్రచందనం, కాంట్రాక్టుల పేర్లు చెప్పి దోపిడీలు, భూకబ్జాలు చేయలేదని బోడే తీవ్ర విమర్శలు చేశారు. బాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీల గురించి ఏనాడు మాట్లాడకుండా నిధుల సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
1983 నుంచి టీడీపీ పునాదులు అయిన బీసీలకు రక్షణ చట్టం తెస్తామని ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కార్యాచరణ అమలు చేయలేదన్నారు. టీడీపీలో ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రక్షణ చట్టం తెచ్చేలా బాబుపై ఒత్తిడి చేయాలని.. లేనిపక్షంలో బానిస బతకు బతకడం కంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు టెట్ అమలుపై దేశంలో అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు తీర్చడం లేదని.. ఆరోగ్య శ్రీ బిల్లులు ఆగి నెట్‌వర్క్ హాస్పటల్స్‌లో పేదలకు వైద్యం చేయడం లేదని.. అయినా ప్రభుత్వం బిల్లులు క్లీయర్ చేయడం లేదన్నారు. బచావత్ కమిషన్ తప్పుడు నివేదిక వల్ల కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టీ డ్యాం ఎత్తుపెంచుతోందని.. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో ఫిటిషన్ వేస్తే.. ఏపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రపంచ దేశాలు వద్దన్న డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకువచ్చి తీర ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు వేస్తున్నారన్నారు. బాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ ఒక్కరికి లబ్ధి జరగలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. రు. 1200 కోట్ల ప్రజాధనంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని.. ప్రజా ధనం దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని బోడే ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవాలంటే పార్టీ లేదా వ్యక్తిగత సొమ్ముతో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటకీ అయినా చంద్రబాబు తన విధానాలు మార్చుకుని.. ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పాటు అందించాలన్నారు. ఈ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థకు చరమగీతం పాడి బలహీన వర్గాలకు అధికారం దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని... ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా.. కుట్రలు జరిగినా తాను వెనకడుగు వేయను అని రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.