డీకే శివకుమార్ సీఎం అవుతారా? కామరాజ్ మోడల్‌తో కాంగ్రెస్ వ్యూహం!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే, ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెరిసగం పంచుకోవాలని అధిష్టానం షరతు విధించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు సిద్దు రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తవడంతో, ఆయన తప్పుకునే సమయం ఆసన్నమైందని అధిష్టానం సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం: 'కామరాజ్ మోడల్ .. ఏ కారణం లేకుండా ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇందుకోసం పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసింది. పార్టీ బలోపేతానికి, కొత్త రక్తం నింపడానికి వీలుగా, చారిత్రక 'కామరాజ్ మోడల్'ను తెరపైకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. 1962లో చైనా యుద్ధం, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగినప్పుడు, నాటి సీఎం కుమారస్వామి కామరాజ్ స్వచ్ఛందంగా తన పదవిని త్యజించి, సీనియర్లందరూ అధికారం వదులుకోవాలని ప్రతిపాదించారు. దీంతో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం లభించింది. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే సిద్ధాంతాన్ని ప్రయోగించి, సిద్ధూతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రివర్గంపై వేటు కత్తి.. డీకేకే పగ్గాలు! .. నవంబరు 20 నాటికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో, అధికార బదిలీకి ఇదే సరైన సమయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయాలని కోరనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే, సిద్ధరామయ్య రాజీనామా చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, పార్టీలో కొత్త రక్తం నింపాలనే డిమాండ్ బలంగా ఉన్నందున దాదాపు 15 మంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సీనియర్ మంత్రులైన పరమేశ్వర, రామలింగారెడ్డి వంటి దిగ్గజాలు సైతం రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి, డిసెంబరులో బెళగావిలో నిర్వహించే విధానసభ సమావేశాలకు కొత్త నాయకత్వం కొలువుదీరే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.